చెలరేగిన కో’ఢ’

చేతులెత్తేసిన పోలీసులు
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
కోస్తాలో యథేచ్ఛగా కోడి పందేలు
గుండాట, పేకాట శిబిరాలు కూడా
తొలిరోజే చేతులు మారిన
వందల కోట్లు

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి :
ఏపీలో కోడిపందేల జోరు మొదలైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయాల పేరుతో పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించడం ఏటా ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఉండే డిమాండు అంతా ఇంతా కాదు. కోర్టులు ఆదేశించినా, పోలీసులు ఆంక్షలు విధించినా చివరకు కోడే గెలుస్తోంది. కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ తొలిరోజే కోడి పందేల హవా మొదలైంది. నిన్న మొన్నటి వరకూ పోలీసులు కోర్టు ఆంక్షల పేరు చెప్పి అక్కడక్కడా ముందస్తు అరెస్టులు చేసినా అధికారపార్టీ నేతల అండతో భోగిపండుగ రోజు పందెంరాయుళ్లకు గ్రీన్‌సిగల్‌ లభించింది. దీంతో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక బరులు వెలిశాయి. గతేడాది సంక్రాంతి సందర్భంగా తమ ఆదేశాలు అమలు కాకపోవడంపై తాజాగా నివేదిక కోరిన హైకోర్టు..ఈ ఏడాది పందేలను అడ్డుకోవాలని మరోసారి హుకుం జారీ చేసింది. పండుగ తర్వాత తమ ఆదేశాలు అమలు జరిగాయో లేదో సమీక్షిస్తామని కూడా హెచ్చరించింది. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. కరోనా ప్రభావం కొంతమేర కనిపిస్తున్నా సంక్రాంతి బరులు మాత్రం పందెం రాయుళ్లతో కళకళలాడుతున్నాయి. అధికారపార్టీ నేతల బినామీలు భారీ షామియానాలు, ఫ్లడ్‌లైట్ల కాంతులు సహా సకల సౌకర్యాలు కల్పిస్తూ శిబిరాలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. భోగి సందర్భంగా మొదలైన కోడి పందేలు కనుమ వరకు జోరుగా సాగుతాయి. ఈ మూడు రోజుల్లో వందల కోట్లు చేతులు మారనున్నాయి. బరుల వద్దకు పందెం రాయుళ్లు మినహా ఎవరినీ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలుచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు బహిరంగంగానే ఈ పోటీలకు హాజరవుతున్నారు. ఆయాచోట్ల పోటీలకు మరింత క్రేజ్‌ ఏర్పడుతోంది. శిబిరాల నిర్వాహకులకు కమీషన్‌ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి పందెంలోనూ ఎవరు గెలిచినా వారి షేర్‌ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ మూడు రోజుల్లోనే వారి ఆదాయం కోట్లలో ఉంటుంది. ఈ బడానాయకుల వ్యాపారాన్ని చూసి ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వారి ఏరియాల్లో చిన్నపాటి శిబిరాలు ఏర్పాటు చేసి కోడి పందేలు గుంభనంగా నిర్వహిస్తున్నారు. మూడురోజులు నిర్వహించే కోడిపందేలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి వందలాది కుటుంబాలు జీవిస్తుంటాయి. కోడికత్తులు తయారు చేసేవారు, కోడి పుంజులకు కత్తులు కట్టేవారు, పందేల కోసం బరుల ఏర్పాటుకు అవసరమైన సన్నాహాల కోసం వందలాది మంది కూలీలు పనిచేస్తారు. ఈ వ్యాపారంలో ప్రతి దానికీ కమీషన్‌ ఉంటుంది. అందుకే ఈ మూడు రోజుల కోసం నిర్వాహకులు ఏడాదంతా ఎదురుచూస్తారు. కోడిపందాలు, పేకాట, గుండాట, కోతాట జీవనోపాధిగా మలుచుకున్న అనేకమందికి ఈ మూడురోజులు పండుగే. బరుల వద్ద పెద్దఎత్తున తాత్కాలిక షాపులు ఏర్పాటు చేస్తారు. కూల్‌ డ్రింక్స్‌ షాపు నుంచి సిగరెట్‌ షాపులు, పలావు సెంటర్లు, చికెన్‌ పకోడి దుకాణాలు, ఇతరత్రా మాంసాహారాలు దొరికే హోటళ్లు, మద్యం విక్రయాలు, అల్పాహార కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం స్థలం అద్దె, అనుమతి ఇచ్చినందుకు నిర్వాహకులకు రోజువారీ చెల్లింపులుగా పెద్ద మొత్తాలు ఇస్తుంటారు. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్గడంతోపాటు వేలాదిమందికి జూదకాంక్ష తీరనుంది. మరోపక్క లక్షలాదిమందికి కనువిందు కలుగనుంది.
తెలంగాణ నుంచి పందెం రాయుళ్ల రాక
కోస్తా ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందేలకు ఏపీలోని ఇతర జిల్లాలవారితో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్దసంఖ్యలో కార్లలో వస్తుంటారు. ఏపీలో ఉండే బంధువులు, స్నేహితుల ద్వారా వీరు ఈ మూడు రోజులు ఇక్కడే మకాం వేసి కోడిపందేలు, పేకాట శిబిరాల్లో పాల్గొంటారు. ఏ శిబిరం వద్ద చూసినా వందల సంఖ్యలో కార్లు, బైకులు దర్శనమిస్తున్నాయి. ధనికవర్గాలకు చెందిన వీరంతా లక్షల్లో పందాలు కాస్తుండటంతో వందల కోట్లు చేతులు మారనున్నాయి.

Thanks! You've already liked this