ఆమెది ఆ కులం… ఆయనది ఈ కులం..కలిసొచ్చిందిగా?

కులం

రోజులు మారుతున్న కొద్దీ రాజ‌కీయాల్లో కూడా మార్పులు వ‌స్తున్నాయి. అవ‌స‌రం, అవ‌కాశం చూసుకుని నాయ‌కులు ఎవ‌రికి త‌గిన విధంగా వారు అడుగులు వేస్తున్నారు. గ‌తంలో ఇంటికో పువ్వు మాదిరిగా ఒక నేత మాత్రమే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారు. త‌ర్వాత మారిన ప‌రిస్థితిలో ఒకే కుటుంబం నుంచి అన్నద‌మ్ములు రంగంలోకి దిగారు. ఇక‌, త‌ర్వాత‌.. భార్యాభ‌ర్తలు, పిల్లలు కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారు. ఇలా వ‌చ్చేసి రాజ‌కీయాల‌ను శాసించినా కూడా, వేరే వారికి అవ‌కాశం లేకుండా చేస్తున్నా కూడా.. నేత‌ల‌కు సంతృప్తి లేకుండా పోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సామాజిక వ‌ర్గాల వారీగా కూడా అవ‌కాశం చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే… ఇత‌ర కులాల‌కు చెందిన వారిని వివాహం చేసుకుని.. త‌ద్వారా రాజ‌కీయాల్లో సామాజిక వ‌ర్గాల రిజ‌ర్వేష‌న్‌ను వినియోగించుకుంటున్నారు.

కులాలే ప్రధానంగా…..?

ఇది కేవ‌లం ఏపీ, తెలంగాణల వ‌ర‌కే ప‌రిమితం అయింద‌ని అనుకుంటే.. పొర‌పాటే అంటున్నారు ప‌రిశీల‌కులు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ త‌ర‌హా కుల రాజ‌కీయాలు పెరిగిపోయాయ‌ని చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో గ‌తంలో ఈ డ‌బుల్ క్యాస్ట్ ఈక్వేష‌న్ పాలిటిక్స్ అంత‌లా ఉండేవి కావు. ఇప్పుడు ఇవి బాగా పెరిగిపోయాయి. ఇక రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం అక్కడ నేత‌లు, ఇక్కడ వారితో బంధుత్వాలు కూడా క‌లుపుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. అయితే.. ఎందుకైనా మంచిద‌ని ఆయ‌న తెలంగాణ‌కు చెందిన దానం నాగేంద‌ర్‌తో వియ్యం పెట్టుకున్నారు. ల‌గ‌డ‌పాటికి హైద‌రాబాద్‌లో ఉన్న కోట్లాది రూపాయ‌ల వ్యాపార సామ్రాజ్యానికి ఇంత‌క‌న్నా సేఫ్ ఏం ఉంది.

ఇచ్చి పుచ్చుకోవడంతో…..

ఇక వైసీపీకే చెందిన న‌‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు.. క్షత్రియ సామాజిక వ‌ర్గం. అయితే.. ఆయ‌న త‌న కుమారుడిని వైఎస్ ఆత్మ,కాంగ్రెస్‌కు చెందిన‌ కేవీపీ రామ‌చంద్రరావు కుమార్తెకు ఇచ్చి వివాహం చేశారు. కేవీపీ.. వెలమ సామాజిక వ‌ర్గం. ఇక‌, మాజీ ఎమ్మెల్యే, తెలుగు మ‌హిళ అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత మాల సామాజిక వ‌ర్గం, ఆమె భ‌ర్త మ‌రో సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి మాదిగ సామాజిక వ‌ర్గం.. కానీ, ఆమె భ‌ర్త సాంబ‌శివారెడ్డి. దీంతో ప‌ద్మావ‌తి రాజ‌కీయం అటు ఎస్సీఅంటూ, ఇటు రెడ్ల కోడ‌లిని అంటూ రెండు ర‌కాలుగా సాగుతోంది.

ఆయన కాపు.. ఆమె కమ్మ…..

విజ‌య‌వాడ విష‌యానికి వ‌స్తే.. దివంగ‌త‌ వంగ‌వీటి రంగా కాపు సామాజిక వ‌ర్గం, ఆయ‌న స‌తీమ‌ణి.. క‌మ్మ సామాజిక వ‌ర్గం. ఇక‌, విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. కాపు సామాజిక వ‌ర్గం. ఆయ‌న స‌తీమ‌ణి సుజాత మాత్రం క‌మ్మ. బెజవాడ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఎదిగిన ఇద్దరు కాపు నేత‌ల భార్యలు కూడా క‌మ్మే కావ‌డం విశేషం. ఇక శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టీడీపీ నాయ‌కురాలు.. గౌతు ల‌చ్చన్న మ‌న‌వ‌రాలు.. శిరీష.. శ్రీశ‌య‌న సామాజిక వ‌ర్గం. కానీ, ఆమె భ‌ర్త వెంక‌న్న చౌద‌రిది మాత్రం క‌మ్మ వ‌ర్గం. ఇక‌, ఇక్కడ నుంచి విజ‌యం సాధించిన మంత్రి అప్పల‌రాజు.. మ‌త్స్యకార సామాజిక వ‌ర్గం. కానీ, ఆయ‌న స‌తీమ‌ణి మాత్రం కాళింగ సామాజిక వ‌ర్గం.

ఈక్వేషన్లు కలిసే….

గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన విడద‌ల ర‌జ‌నీ బీసీల్లో ముదిరాజు సామాజిక వ‌ర్గం, కానీ, ఆమె భ‌ర్త మాత్రం కాపు. ర‌జ‌నీ గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించ‌డానికి కాపు + బీసీ ఈక్వేష‌న్ కూడా ప‌నిచేసింది. ఇదే జిల్లా తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన డాక్టర్ శ్రీదేవి.. మాదిగ సామాజిక వ‌ర్గం.. కానీ ఆమె భ‌ర్త కాపు. ఆమెకు కూడా గ‌త ఎన్నిక‌ల్లో ఈ ఈక్వేష‌న్ ప్లస్ అయ్యింది. ఇలా చెప్పుకొంటూ.. పోతే.. రాష్ట్రంలో రాజ‌కీయ కులాలకు అంతు ద‌రి క‌నిపించ‌డం లేదు. మొత్తానికి రాజ‌కీయాల్లో ఏ చిన్న అవ‌కాశం ఎటూ జారిపోకుండా నాయ‌కులు జాగ్రత్తలు ప‌డుతున్న తీరు భ‌లే ఉంది కదూ.

The post ఆమెది ఆ కులం… ఆయనది ఈ కులం..కలిసొచ్చిందిగా? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this