అప్పలరాజు రాజకీయం అదరహో…?

అప్పలరాజు

కొత్త ఎమ్మెల్యే. అందునా రాజకీయ వాసనలు లేని ఓ సాధారణ కుటుంబం ఆయనకు జగన్ టికెట్ ఇవ్వడమేంటి అని అంతా అనుకున్నారు. ఆయన ఒక మామూలు వైద్యుడు. జగన్ పాదయాత్రలో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. ఆయనలోని నాయకుడిని జగన్ చూశారు. అంతే అప్పటికి నాలుగేళ్ళుగా పార్టీని అట్టిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకుడిని పక్కన పెట్టి మరీ పలాస నియోజకవర్గానికి ఇంచార్జిని చేశారు. ఆ మీదట ఆయనకే ఎమ్మెల్యే టికెట్ అన్నారు. దాంతో పార్టీలో సీనియర్లు అంతా తట్టా బుట్టా సర్దుకుని టీడీపీలోని వెళ్ళిపోయారు. జగన్ డెసిషన్ రాంగ్ అని నాడు సొంత పార్టీలోనే అనుకున్నారు.

గౌతు ఫ్యామిలీకి దెబ్బ…..

అవతల చూస్తే బీసీల దేవుడుగా ఉన్న గౌతు లచ్చన్న కుటుంబం టీడీపీ తరఫున పోటీలో ఉంది. మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె శిరీష ఎమ్మెల్యేగా పోటీ చేస్త డాక్టర్ అప్పలరాజు వైసీపీ నుంచి బస్తీ మే సవాల్ అన్నారు. జగన్ గాలికి తోడు డాక్టర్ గారి ఇమేజ్ కూడా జతకలసి భారీ మెజారిటీతో ఆయన ఒక్క దెబ్బకు ఎమ్మెల్యే అయిపోయారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వ పక్షాన అసెంబ్లీలో మాట్లాడుతూ తన వాగ్దాటితో జగన్ మనసు చూరగొన్నారు. అంతే ఏడాది కూడా తిరగకుండానే మంత్రి పదవి కూడా ఏరి కోరి అప్పలరాజుని వరించింది.

దూకుడే అడ్రస్ గా ….

రాజకీయాలు అంటే పక్కా మాస్. డాక్టర్ మాత్రం క్లాస్. ఈయనేం మంత్రిగా రాణిస్తాడు అనుకుంటే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబానికే ఇపుడు చుక్కలు చూపిస్తున్నారు. మాటకు మాట, యాక్షన్ కి రియాక్షన్ అంటూ అప్పలరాజు సిక్కోలు జిల్లాలో చేస్తున్న దూకుడు రాజకీయంతో తమ్ముళ్లకు మతులు పోతున్నాయి. అదే సమయంలో లోపాయికారీ రాజకీయాలతో నెట్టుకు వస్తున్న వైసీపీ లోని పెద్ద తలకాయలకు మాత్రం ఈ పరిణామాలు అసలు మింగుడుపడడంలేదుట. అప్పలరాజు జోరుని తగ్గించుకోమంటున్నా ఆయన ఆగడంలేదు పైగా జగన్ మద్దతు కూడా ఉండడంతో అచ్చెన్నను గట్టిగానే ఢీ కొంటున్నాడు.

కంటిన్యూ అయితే…?

ఇక మరో పది నెలలలో ఏపీలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది. అంటే పనిచేయని మంత్రులకు వేటు కొత్తవారికి చోటు అన్నమాట. మరి అప్పలరాజుని ఉంచుతారా అంటే కచ్చితంగా అన్న మాట ఇపుడు వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ అప్పలరాజు దూకుడుని చూసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. అప్పలరాజు పలాసలో సౌండ్ చేస్తే టెక్కలిలో అచ్చెన్న ఇలాకా షేక్ అవుతోంది మరి. దాంతో అచ్చెన్నాయుడుని అసెంబ్లీలో మరో మారు చూడను అంటున్న జగన్ కోరిక మేరకు అప్పలరాజు బాగా స్పీడ్ పెంచేశారు అంటున్నారు. మరి అప్పలరాజు సీటు ఖాళీ కాకపోతే జిల్లాలో కొంతమంది మంత్రి పదవుల ఆశలు తీరవని ఇప్పటి నుంచే వైసీపీలో ఆశావహులు బెంగపెట్టేసుకుంటున్నారుట. అయినా అప్పలరాజు ఆగుతారా?

The post అప్పలరాజు రాజకీయం అదరహో…? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this