మోడీని సెంటిమెంటుతో కొట్టిన రైతులు.. వాట్ నెక్ట్స్‌!!

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ఆయ‌న మాతృమూర్తి అంటే.. ఎంత ప్రేమో.. తెలిసిందే. ఏ పండ‌గ వ‌చ్చినా.. త‌న వ్య‌క్తిగత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవాల్సి వ‌చ్చినా.. తొలుత ఆయ‌న గుజ‌రాత్‌కు వెళ్లి.. త‌ల్లి ఆశీర్వాదం తీసుకున్న త‌ర్వాతే ప్రారంభిస్తారు. ప్ర‌ధానిగా తొలి సారి పీఠం ఎక్కిన‌ప్పుడు.. రెండో సారి అవ‌కాశం నిల‌బెట్టుకున్న‌ప్పుడు.. కూడా మోడీ.. త‌న మాతృభ‌క్తిని చాటుకున్నారు. అదేస‌మ‌యంలో త‌న పుట్టిన రోజును సైతం త‌ల్లి స‌మ‌క్షంలోనే చేసుకునేవారు. మొత్తంగా అమ్మ హీరాబెన్‌కు మోడీకి మ‌ధ్య ఉన్న బంధం.. చాలా బ‌లోపేతమ‌నే విష‌యం తెలుస్తోంది. ఇప్పుడు ఈ సెంటిమెంటునే రైతులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు.

మోడీని సెంటిమెంటుతో కొట్టిన రైతులు.. వాట్ నెక్ట్స్‌!!

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రెండు నెల‌ల‌కు పైగా ఆందోళ‌న చేస్తున్న అన్న‌దాత లు.. కేంద్రంపై ఫైర్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అనేక మార్గాల్లో ఉద్య‌మాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం పంజాబ్‌-ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఉద్య‌మం కొన‌సాగుతోంది.

అదేస‌మ‌యంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంది. త్రిస‌భ్య క‌మిటీ వేసింది. ఇక‌, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ఏడాదిన్న‌ర‌పాటు అమ‌లు చేయ‌బోమ‌ని.. కేంద్రం వెనుక‌డుగు వేసింది. అయిన‌ప్ప‌టికీ.. స‌ద‌రు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు అన్న‌దాత‌లు. ఈ క్ర‌మంలో ఈ వివాదం తెగ‌దు-ముడిప‌డ‌దు.. అన్న విధంగా మారింది. ఇదిలావుంటే.. ఇప్పుడు పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే రైతు కొత్త పంథాను ఎంచుకున్నారు. మోడీని సెంటిమెంటుతో త‌మ వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించారు.

నేరుగా.. త‌మ స‌మ‌స్య‌ను.. కొత్త రైతు చ‌ట్టాల వ‌ల్ల త‌మ‌కు క‌లుగుతున్న బాధ‌ను వివ‌రిస్తూ.. ప్ర‌ధాన మంత్రి ఎంతో ప్రేమించే ఆయ‌న మాతృమూర్తి హీరా బెన్‌కు ఐదు పేజీల లేఖ రాశారు. తీవ్ర‌ భావోద్వేగంతో రాసిన ఆ లేఖలో వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందిగా ప్రధాని హోదాలో ఉన్న మోదీకి.. ఓ త‌ల్లిగా నచ్చజెప్పాలని హీరాబెన్‌ను ఆ రైతు విన్న‌వించారు. మ‌రి ఈ సెంటిమెంటు లెట‌ర్‌.. ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

ఇదీ… లేఖ సారాంశం!!

“బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నాను. దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలు మూడు నల్ల చట్టాల కారణంగా గడ్డకట్టించే చలిలో గత్యంతరం లేక రోడ్లపై నిద్రపోతున్నారు. ఈ అభాగ్యుల్లో 90 నుంచి 95 ఏళ్ల వయోవృద్ధులు, పిల్లలు, మహిళ లు కూడా ఉన్నారు. చలిగాలులతో వారంతా జబ్బు పడుతున్నారు. బలిదానాలకు కూడా సిద్ధమవుతున్నారు. ఇది తలుచుకుం టేనే మా హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. ఆదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్ సంస్థల కోసం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాల కారణంగానే ఢిల్లీ సరిహద్దుల్లో మేమంతా శాంతియుత ఆందోళన కొనసాగిస్తున్నాం. కొండంత ఆశతో ఈ లేఖ రాస్తున్నాను. మీ కుమారుడు మోదీ ఈ దేశానికి ప్రధాని అయినందున, ఆయనే ఆమోదింపజేసిన సాగు చట్టాలను ఆయనే రద్దు చేయగలరు. తల్లి మాటను తోసిపుచ్చే కొడుకు ఎక్కడా ఉండడనే నమ్మకంతోనే ఈ లేఖ రాస్తున్నా.  యావద్దేశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. తల్లి మాత్రమే కొడుకును శాసించగలదు. సాగు చ‌ట్టాలు ర‌ద్దు చేయాల‌ని మీ కుమారుడి(మోడీ)కి చెప్పండి“ అని సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Thanks! You've already liked this