పంతమా..? అంతమా..?

నిమ్మగడ్డ రమేష్ కుమార్

మతపరంగా రాష్ట్రంలో వివాదం సృష్టించాలని ప్రధాన ప్రత్యర్థులు బావిస్తే , కులపరంగా ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకుని ప్రకంపనలు సృష్టించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో రెండు నెలలలో పదవీ విరమణ చేసే వ్యక్తి. ఆయనతో గొడవతో ప్రభుత్వానికి కలిసొచ్చేదేం లేదు. కానీ ఆయన సాకుగా టీడీపీ, బీజేపీలతో ప్రత్యక్షంగా, తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న వర్గంతో పరోక్షంగా పోరాటం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి స్థాయిలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై కుల ముద్ర వేసేశారు. దానిని కొనసాగించి, నిరంతరం చర్చలో ఉండేలా చూడటమే ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ అనంతరం కూడా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎత్తుగడ కనిపిస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు సామాజిక వర్గాన్ని ఒంటరిని చూసి మిగిలిన వర్గాలను అక్కున చేర్చుకోవాలనే వ్యూహమూ తొంగిచూస్తోంది. వీటన్నిటితోపాటు ఇటీవల చర్చకు వస్తున్న మతపరమైన అంశాలను ప్రజల దృష్టిలోంచి చెరిపేయాలనేది మరో కోణం.

పోరు లాభమే….

పోరు నష్టం. పొందు లాభం అన్న సూత్రం సాధారణ ప్రజలకు వర్తిస్తుందేమో కానీ రాజకీయాలకు కాదు. నిరంతరం సంఘర్షణకే ఇక్కడ పెద్ద పీట. విధానాలు, సైద్ధాంతిక పరంగా నూ, ఆధిపత్యం, అధికారం కోసమూ బహుముఖంగా పోరు సాగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల పంచాయతీ వినోదాన్ని పంచుతోంది. పార్టీలకు ఇది పెద్ద ముడిసరుకు. రాష్ట్రంలో సమస్యలన్నీ అటకెక్కేశాయి. దేవాలయాలపై దాడులు, పంచాయతీ ఎన్నికలు పెద్దవై కూర్చున్నాయి. ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వివాదాన్ని పెంచి పోషిస్తోందనేది విశ్లేషకుల అంచనా. బీజేపీ, తెలుగుదేశం ఇటీవలి కాలంలో హిందూ మత భావనను అజెండాగా చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయి. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే ఎన్నికల గోల చుట్టూ రాజకీయ పార్టీలు విభేదించుకునే అజెండాను ప్రభుత్వం సెట్ చేసింది. అనుకున్నట్లుగానే ఈ వ్యూహం ఫలిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు ముక్తకంఠంతో ఎన్నికల నినాదాన్ని ఎత్తుకున్నాయి. జగన్ మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే పనిలో పడ్డాయి.

వ్యూహమేనా…?

నిజానికి వారం, పదిరోజుల క్రితం వరకూ ఒకటే హడావిడి. రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల అంశమే ప్రధాన వార్తగా పార్టీలు రోడ్డెక్కాయి. ఎస్సీఈసీకి , ప్రభుత్వానికి మధ్య ఎన్నికల ప్రతిష్టంభనతో దేవాలయాల అంశం అప్రాధాన్యమై పోయింది. . వెంటనే ఎన్నికలు జరిగినా , జరగకపోయినా ప్రతిపక్షాలకు వచ్చే పెద్ద లాభమేమీ లేదు. అధికారపార్టీకి వచ్చే పెను నష్టమూ లేదు. పంచాయతీలు పార్టీ రహితమనే ముద్ర ఎలానూ ఉంటుంది. నెగ్గినవారిని అధికారపార్టీ తమ ఖాతాలోనే చూపించుకుంటుంది. 30 శాతం వరకూ ప్రతిపక్షాల వాళ్లు నెగ్గినా వాళ్లంతా అధికారపార్టీతో అంటకాగడమూ ఖాయమే. మరి దానికోసం ఇంత తతంగం ఎందుకు? పంతాలు, పట్టుదలలు ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రతిపక్షాలకు , యంత్రాంగానికి నిర్దిష్టమైన హెచ్చరికను సంకేతాత్మకంగా చూపించాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అందుకే ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చికూడా సుప్రీంను ఆశ్రయించింది. ఈ ప్రతిష్టంభనను సాధ్యమైనంతవరకూ కొనసాగిస్తుంది. అయితే రాజ్యాంగ సంక్షోభం వంటి పరిస్థితిని కొనితెచ్చుకొనే ప్రసక్తి లేదని వైసీపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం రక్షిత విధానంలోనే తనకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుందంటున్నారు. ఈలోపు కులపరంగా భారీ చర్చ జరిగేలా జాగ్రత్త పడుతున్నారు. మతానికి కులం విరుగుడుగా మారుతుందని నమ్ముతున్నారు.

వీరేం చేస్తున్నట్లు..?

ప్రజల దృష్టి కోణంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి మాత్రమే కావాలి. వివాదాలు వారికి పెద్దగా పట్టవు. అవి రాజకీయనాయకులకు, పార్టీలకు పరిమితమైన అంశాలు. అందువల్ల జగన్ వర్సస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో మీడియా కనబరిచిన ఆసక్తిని ప్రజలకు పట్టడం లేదు. ప్రభుత్వ పెద్దలకు ఈవిషయం బాగా తెలుసు. అందుకే రాద్ధాంతాన్ని సాధ్యమైనంతగా సాగదీస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరపాలనేది ప్రభుత్వ పెద్దలకు తెలియని విషయం కాదు. సంపాదకుడిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కల్లం వంటివారు సలహా మండలిలో ఉన్నారు. పైపెచ్చు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ గతంలో రెండుసార్లు ఎన్నికల కమిషన్ దెబ్బలు చవి చూశారు. బదిలీ అయ్యారు. అందువల్ల జగన్ మోహన్ రెడ్డికి చెప్పడానికి వీరెవరూ ఇష్టపడటం లేదు. ఆయన వ్యూహాన్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. ప్రభుత్వపరంగా ఎన్నికల విధులు దాదాపు ప్రతిష్టంభనలో పడటంలో వీరందరూ పాత్రధారులే.

నష్టం ఎవరికి…?

ప్రభుత్వంతో గొడవ పెట్టుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమీ సాధించలేరు అని ప్రభుత్వంలోని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. తనకెలాగూ పదవీకాలం పూర్తవుతోంది కాబట్టి ఆయనకు నష్టమేం లేదని మరోవర్గం వాదిస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ప్రభుత్వమే కష్టనష్టాలను చవిచూడాల్సి ఉంటుందని కొందరు పదవీ విరమణ చేసిన సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. న్యాయస్థానాల తీర్పులు అమలు కాకపోతే ఎవరేని పౌరుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఏదేమైనా పట్టువిడుపులు లేని పంతంలో ‘సుప్రీం’ తీర్పు మాత్రమే మార్గం చూపాలి. ఈలోపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూ అధికార, విపక్షాల రాజకీయం సాగుతూనే ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

The post పంతమా..? అంతమా..? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this