‘వి’ ఫర్ విక్టరీ ఎవరిదో…?

వైసీపీ

రాష్ట్రంలో పంచాయతీలు, స్థానిక సంస్థల మొత్తం తీర్పు ఒక ఎత్తు. రాష్ట్రంలో పెద్ద నగరాలైన విశాఖ, విజయవాడలిచ్చే తీర్పు మరొక ఎత్తు. విశాఖ, విజయవాడ ఓటర్లు ప్రధాన రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. చావో, రేవో అన్నంతగా ఆయా పార్టీలు తలపడక తప్పని స్థితిని కల్పిస్తున్నారు. తమ విదానపరమైన నిర్ణయాలకు ప్రజాస్పందన ఎలా ఉందో తెలిపే కీలక ఎన్నికలు కావడమే ఇందుకు కారణం. ఈ రెండింటిలో ప్రజలిచ్చే తీర్పు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలతో పాటు జనసేన, బీజేపీ కూటమికి సైతం రాజకీయ మార్గనిర్దేశం చేయబోతోంది. ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణం, భిన్నమైన నేపథ్యం ప్రజాతీర్పుపై పార్టీల ఆసక్తిని మరింత పెంచుతోంది. కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తెచ్చితీరతామని ప్రతిన పూనిన వైసీపీ నిర్ణయాన్ని ఆ ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్నారా? అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుకుంటున్న టీడీపీ ఆందోళనకు కనీసం బెజవాడ లో అయినా మద్దతు లభిస్తోందా? అన్న అంశాలకు మున్సిపల్ ఎన్నికలు సూచన కాబోతున్నాయి. తమ వాదనలకు బలం చేకూర్చుకునేందుకు అధికార, విపక్షాలు చెమటోడ్చి కష్టపడుతున్నాయి. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

విశాఖ ఒడ్డెక్కిస్తుందా…?

రాష్ట్రంలో పెద్ద నగరమే కాకుండా ఉత్తరాంధ్ర కేంద్ర స్థానం విశాఖ . విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వలస వచ్చి వ్యాపార, పారిశ్రామిక, ఉద్యోగాల్లో స్థిరపడిన వారే నేతల్లో అధికంగా కనిపిస్తారు. కేంద్ర సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఉత్తర భారతీయుల సంఖ్య కూడా అధికమే. బ్రిటిష్ కాలం నుంచి వాణిజ్య, వర్తక వ్యవహారాలు చోటు చేసుకుంటుండంతో క్రిస్టియన్ల సంఖ్య సైతం ప్రభావ శీలంగా కనిపిస్తుంది. అటు ఉభయగోదావరి జిల్లాలు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చి స్థానికంగా స్థిరపడిన బలమైన సామాజిక వర్గాల నేపథ్యమూ ఇక్కడ కనిపిస్తుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల నుంచి వచ్చిన కాంట్రాక్టు, వ్యాపార వేత్తలూ అధికమే. మొత్తమ్మీద విశాఖ ఒక మినీ ఇండియా, మినీ ఆంధ్రప్రదేశ్ ను తలపిస్తుంది. పార్టీ పెట్టినప్పట్నుంచి ఇక్కడ పట్టు సాధించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. సాక్షాత్తు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసినా 2014లో పరాజయమే ఎదురైంది. 2019లోనూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగినా విశాఖ నగరంలో మెజార్టీ స్థానాల్లో టీడీపీకి పట్టం గట్టారు ఓటర్లు. అదంతా గతం. రాజధానినే మీకు తెచ్చిపెడతామంటున్న వైసీపీకి విశాఖ ఓటర్లు ఇప్పుడైనా మద్దతిస్తారా? లేదా? అన్నది రాజకీయ సంకటం. ఈసారి కూడా శాసనసభ ఎన్నికల తరహాలో ఓటర్లు తిరస్కరిస్తే అధికారపార్టీకి తీవ్రమైన అవమానమే. రాజకీయంగా అత్యంత వివాదాస్పదమైన రాజధాని ప్రకటనను విశాఖ ప్రజలు స్వాగతించడం లేదన్న సంకేతాలూ వెలువడతాయి.

విజయ హారం పడుతుందా?

టీడీపీకి గరిష్టంగా మద్దతిచ్చే కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా కలిగిన నగరం విజయవాడ. అయినా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడి ఓటర్లు ఘన విజయం చేకూర్చిన ఉదంతాలు పెద్దగా లేవు. అమరావతి ఉద్యమానికి ఇక్కడి పెద్దలు నైతికంగా, ఆర్థికంగా బలాన్ని సమకూర్చి పెడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ ఓటర్ల తీర్పునకు భిన్నంగా విజయవాడ ఓటర్లు వైసీపీ పార్టీకే పట్టం గట్టారు. సామాజిక వర్గ సమీకరణ పెద్దగా పనిచేయలేదు. ఇప్పుడు రాజధాని అంశం కూడా ఓటర్ల మదిలో నానుతోంది. తమ చెంతనే ఉన్న కేపిటల్ ను విశాఖకు తరలించాలనుకుంటున్న వైసీపీ పట్ల ప్రజలు ఏరకంగా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంటోంది. నిజానికి ఇవి స్థానిక ఎన్నికలు . అయినప్పటికీ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు దోహద పడతాయి. ప్రభుత్వ నిర్ణయాల పట్ల వ్యతిరేకతను, అసంతృప్తిని వెలిగక్కేందుకు ఉపకరిస్తాయి. ఒకవేళ ఇంకా2019 నాటి స్థాయి మద్దతే ప్రజల్లో నెలకొని ఉంటే అధికారపార్టీ యే గట్టెక్కుతుంది. రాజధానిపై విజయవాడలోనే మద్దతు కూడగట్టలేకపోయిన టీడీపీ నైతికంగా పరాజయం పాలయినట్లవుతుంది. అమరావతి డిమాండ్ కు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు కూడగట్టడంలో తెలుగుదేశం ఇప్పటికే విఫలమైంది. విజయవాడలోనూ చుక్కెదురైతే టీడీపీ అమరావతి రాజధాని నినాదం అటకెక్కినట్లే. తెలుగుదేశానికి రాజకీయంగా దానివల్ల పెద్దగా ఉపయోగం లేదని తేటతెల్లమైపోతుంది. విజయవాడలో వైసీపీ విజయం సాధించగలిగితే రాజధాని తరలింపుపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఘంటాపథంగా చెప్పుకోగలుగుతుంది. తమ నిర్ణయం అమలును వేగవంతం చేసుకోవచ్చు.

సమరంలో సవాల్…

అధికార, ప్రతిపక్షాలకే కాదు, బీజేపీ, జనసేన కూటమికీ ఈ రెండు నగరాలు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. మతపరమైన అంశాలు, ఉద్యమాలు నడిపిన విజయవాడలో ఈ కూటమి కనీస బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. విశాఖలో ఎదురీతనుంచి బయటపడి బలాన్ని చాటుకోవాలి. విశాఖ ఉక్కు ఉద్యమం ఊపందుకుంది. ఇందుకు ప్రధాన దోషిగా బీజేపీని అన్నిపార్టీలు చూపిస్తున్నాయి. గతంలో విశాఖలో బీజేపీకి బలముంది. ఇక్కడ నుంచి ఎంపీ ప్రాతినిధ్యం వహించారు. శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడు సైతం ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఉత్తరాది ఓటర్లు, మత సమీకరణలు బలంగానే ఉన్నాయి. దానికితోడు పవన్ కల్యాణ్ కారణంగా సామాజిక సమీకరణ తోడయ్యే వాతావరణం. కానీ వీటన్నిటికీ మించి ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రతికూల పవనాలను కల్పిస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను రాజకీయంగా ప్రతిఘటిస్తున్న వైసీపీ, టీడీపీలు సైతం ఇందుకు బాధ్యులే. ప్రయివేటీకరణకు చంద్రబాబు నాయుడి హయాంలోనే పావులు కదిలాయి. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒప్పందాలు కుదిరాయి. అంతా తెలిసినా చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి తేలుకుట్టినట్లు మౌనం వహించారు. ప్రస్తుతం బీజేపీని దోషిగా చూపి తాము గట్టెక్కాలని ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మొత్తం వ్యవహారంలో ప్రజా కంటకంగా ఏకాకి కూటమిగా మారింది బీజేపీ, జనసేన . ఈ కూటమి పట్ల విశాఖ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది ఈ ఎన్నికలు తేల్చి చెప్పబోతున్నాయి. పార్టీలకే కాదు చాలా సంవత్సరాలుగా ఇక్కడే మకాం వేసి రాజకీయ చక్రం తిప్పుతున్న వైసీపీ నంబర్ టు విజయసాయి రెడ్డి కి కూడా ఇజ్జత్ కా సవాల్ గా ఈ ఎన్నికలను చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

The post ‘వి’ ఫర్ విక్టరీ ఎవరిదో…? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this