ధర్నా ప్రాంతంలో చిక్కుకున్న పెళ్లికూతురు

వివాహ సమయం దగ్గరపడుతోంది.. ఫంక్షన్‌హాల్‌కు చేరుకోవాల్సిన పెళ్లికూతురు.. ఆశ వర్కర్లు చేస్తున్న ధర్నా ప్రాంతంలో చిక్కుకుంది.. పెళ్లి సమయానికి ఫంక్షన్‌ హాల్‌కు చేరకుంటే పరిస్థితి ఏమిటని బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.. కారులోంచి పెళ్లికూతురును బయటకు తీసుకొచ్చి.. ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టి పెళ్లి మండపానికి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌ కాలనీకి చెందిన నేరెళ్ల సాహితికి మధుకర్‌తో జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డు నాయీబ్రాహ్మణ సంఘ భవనంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. సాహితి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి టీఆర్‌నగర్‌ నుంచి కారులో జగిత్యాలకు బయలు దేరారు. కలెక్టరేట్‌ వద్దకు రాగా నే అక్కడ ఆశ వర్కర్లు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ధర్నా చేస్తున్నారు.

పెళ్లికూతురు కారు అక్కడే చిక్కుకుపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకారులతో మాట్లాడినా ఫలితం లేదు. ఆందోళనకారులు రోడ్డుపైనే బైఠాయించారు. చేసేదిలేక పెళ్లికూతురు సోదరుడు స్వరాజ్‌ కృష్ణ అక్కడే ఉన్న ఒకరి ద్విచక్ర వాహనం తీసుకున్నారు. పెళ్లి కూతురును దానిపై ఎక్కించుకుని వేరే మార్గం ద్వారా పెళ్లి మండపానికి తీసుకెళ్లాడు. నిర్దేశిత సమయానికి వివాహం జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

The post ధర్నా ప్రాంతంలో చిక్కుకున్న పెళ్లికూతురు appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this