శాస్త్రవేత్తల కృషి అనిర్వచనీయం: మోదీ

న్యూదిల్లీ: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. 1998లో పోఖ్రాన్‌లో అణు పరీక్షలు విజయంతం కావడానికి దోహదపడిన వారి ప్రతిభను ప్రశంసించారు. ఆనాటి సంఘటనల సమాహారమైన వీడియోను షేర్‌ చేశారు. ‘ఈ నేషనల్‌ టెక్నాలజీ రోజున మన శాస్త్రవేత్తలకు అభినందనలు.1998లో పోఖ్రాన్‌ అణుపరీక్షలు విజయవంతమయ్యేలా వారు చేసిన కృషి అనిర్వచనీయం. ఈ సమయంలో అత్యుత్తమ ధైర్యం, రాజనీతిజ్ఞతను ప్రదర్శించిన అతల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వాన్ని గర్వంగా స్మరించుకుందాం’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఆయన షేర్‌ చేసిన వీడియోలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించిన ప్రదేశం కనిపిస్తోంది. అక్కడ చేపట్టిన మూడు భూగర్భ అణు పరీక్షలు విజయవంతమయ్యాయని వాజ్‌పేయి చేసిన ప్రకటన అందులో వినొచ్చు. ‘వాజ్‌పేయి నాయకత్వంలో అణు పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్‌ తన అపార శక్తిసామర్థ్యాలను, ధైర్యాన్ని ప్రపంచానికి చాటింది’ అని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేశారు. ఈ పరీక్షలు నిర్వహించిన మే 11ను నేషనల్‌ టెక్నాలజీ డేగా దేశం జరుపుకుంటోంది. ఇవి విజయవంతమైన తర్వాత భారత్‌ అణుదేశమంటూ వాజ్‌పేయి ప్రకటన చేశారు. దాంతో న్యూక్లియర్‌ క్లబ్‌లో చేరిన ఆరో దేశంగా భారత్‌ నిలిచింది.

The post శాస్త్రవేత్తల కృషి అనిర్వచనీయం: మోదీ first appeared on విశాలాంధ్ర.

Thanks! You've already liked this