ధరల అదుపులో పాలకులు విఫలం

15న వామపక్ష పార్టీల సమావేశం
రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్‌గా మారుస్తున్న జగన్‌
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ

విశాలాంధ్ర`బ్యూరో కర్నూలు: విజయవాడలో మే 15వ తేదీన 10 వామపక్షపార్టీలు సమావేశమవుతాయని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. ధరలు అదుపుచేయడంలో మోదీ, జగన్‌ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, దీనిపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సీఆర్‌ భవన్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్రకార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి ఎస్‌ఎన్‌ రసూల్‌తో కలిసి రామకృష్ణ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, వారిని పలకరించే నాథుడే లేడని రామకృష్ణ విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలు, గాలులకు అనంతపురం పట్టణానికి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు కుప్పకూలాయని, దీంతో నాలుగురోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదని మండిపడ్డారు. నవంబరులో అధిక వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, 69 మంది మృతి చెందినా ఇప్పటికీ నష్టపరిహారం అందించలేదన్నారు. ఈ సమస్యలపై దృష్టిసారించాలని సీఎం జగన్‌కు సూచించారు. కేబినెట్‌ సమావేశంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ గురించి చర్చించలేదని, దీనిపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానన్నారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్‌ ధరలు పెరగడంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను మహిళలు నిలదీస్తున్నారన్నారు. పక్కరాష్ట్రాల కన్నా మనరాష్ట్రంలోనే పెట్రోల్‌ ధరలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారని రామకృష్ణ విమర్శించారు. బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.1.99 ఉంటే..అదానీ నుంచి రూ.2.49కు కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అదానీ కుటుంబానికి కృష్ణపట్నం పోర్టు, విద్యుత్‌ కాంట్రాక్టుతో పాటు రాజ్యసభ సీటు బహుమతిగా ఇస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మారుస్తారన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై 26 జిల్లాల్లో సీపీఐ పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుందన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీపై కొందరిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం చెపుతున్నా…మంత్రి బొత్స అలాజగలేదని చెప్పడం ఏమిటని నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే కార్పొరేట్‌ విద్యాసంస్థలను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీ కేసులో నారాయణను అరెస్టుచేసి ప్రభుత్వం అభాసుపాలైందన్నారు.

The post ధరల అదుపులో పాలకులు విఫలం first appeared on విశాలాంధ్ర.

Thanks! You've already liked this