బార్లలో పొరుగు మద్యం.. ఎస్‌ఈబీ తనిఖీతో వెలుగులోకి

అమరావతి, ఆంధ్రప్రభ: : రాష్ట్రంలోని కొందరు బారు యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారుల ఆలసత్వం..కాసుల కక్కుర్తిని ఆసరాగా చేసుకొని సుంకం చెల్లించని పొరుగు రాష్ట్రాల మద్యం బార్లలో విక్రయిస్తున్నారు. మరో నెలలో బార్ల లైసెన్స్‌లు రెన్యువల్‌ నేపధ్యంలో ప్రభుత్వ విధానం మార్చుకునే అవకాశం ఉండొచ్చని భావిస్తున్న బార్ల నిర్వహకులు అందినకాడికి దండుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాలు తిరిగి మొదలయ్యాయి. గతంలో గుట్టు చప్పుడు కాకుండా ఎన్‌డీపీ(సుంకం చెల్లించని) మద్యం అమ్మకాలు జరిగేవి. చెక్‌ పోస్టు నిఘా కళ్లుగప్పి తీసుకొచ్చిన మద్యం ఏజెంట్ల ద్వారా అవసరమైన వారికి అందించేవారు. వారు తమ ప్రాంతాల్లోని తెలిసిన వ్యక్తులకు మాత్రమే అమ్మకాలు జరిపేవారు. కొద్ది రోజుల కిందట నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ మద్యం షాపులు కేంద్రంగా ఎన్‌డీపీ మద్యం అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి.

తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్న మద్యం నేరుగా ప్రభుత్వ దుకాణాల్లోనే విక్రయించడం అప్పట్లో సంచలనం రేపింది. దీంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్రభుత్వ మద్యం షాపులపై కన్నేసి ఉంచారు. ఈ క్రమంలోనే బార్లలో కూడా పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఇటీవల విజయవాడలో వెలుగు చూసింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులకు అందిన సమాచారం మేరకు విజయవాడ కృష్ణలంకలోని ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టగా తెలంగాణ మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఖంగుతిన్న ఎస్‌ఈబీ అధికారులు ఇతర బార్లపై కూడా దృష్టిసారించారు. ఎస్‌ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ల కార్యకలాపాలపై దృష్టిసారించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Thanks! You've already liked this