ముందుగానే నైరుతి రుతుపవనాలు.. జూన్‌ 1న రాయలసీమకు

అమరావతి, ఆంధ్రప్రభ : ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ ప్రారంభ తేదీ కంటే ముందుగానే రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు మే 15న దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న బంగాళాఖాతాన్ని, మే 27న కేరళను తాకనున్నాయని పేర్కొంది. సాధారణ పరిస్థితుల్లో, నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళకు, జూన్‌ 4 లేదా 5న రాయలసీమ ప్రాంతానికి వస్తాయి. కానీ ఈఏడాది జూన్‌ 1నే ఏపీకి రానున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతానికి వచ్చిన ఐదు రోజుల తర్వాత జూన్‌ 10న మొత్తం ఏపీని తాకాయి. ఆసాని తుఫాను కారణంగా కురిసిన వర్షాలు మరియు గాలులతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ఈతుఫాను రుతుపవనాలను బంగాళాఖాతంలోకి కొంచెం ముందుగానే లాగడంలో సహాయపడిందని వాతావరణ నిపుణులు తెలిపారు.

నైరుతి రుతుపవనాలు మే 27 న కేరళలో ప్రవేశిస్తే జూన్‌ 1 నాటికి ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేరుకోవడానికి మరో వారం పడుతుందని వాతవరణ శాఖ అధికారులు చెబుతున్నారు. క్రాస్‌-ఈక్వటోరియల్‌ గాలుల కారణంగా, దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో మే 15 నాటికి నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఏపీలో మొత్తం 613.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది సాధారణం కంటే 19 శాతం ఎక్కువ. 2020లో, జూన్‌ 1 మరియు సెప్టెంబర్‌ 30 మధ్య మొత్తం 738.2 ఎంఎం వర్షపాతం నమోదైంది, ఇది సాధారణ వర్షపాతం 514 ఎంఎం కంటే 44 శాతం ఎక్కువ. ఈక్రమంలోనే ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు ఊరట లభించింది. ఒంగోలులో 7.4, కడపలో 7.1, కావలిలో 7.3, నెల్లూరులో 6.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇది నైరుతీ ముందస్తుకు సంకేతమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Thanks! You've already liked this