వీధి వ్యాపారులకు అండగా సర్కారు.. వడ్డీ భారం నుంచి రక్షిస్తున్న పురపాలకశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వీధి వ్యాపారులకు రుణాల విషయంలో తెలంగాణ దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు విడతల రుణాల పంపిణీలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ మూడో విడతలోనూ తొలి రుణాన్ని అందించిని రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. రెండో విడతలో తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన వారికి మూడో విడత రూ.50 వేల రుణాన్ని అందిస్తున్నారు. ఈ రుణాన్ని 36 నెలల్లో తిరిగి చెల్లించే వెసులుబాటు వ్యాపారులకు కల్పించారు. పట్టణ ప్రగతిలో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకే అధికారులు ఈ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మూడో విడతలో భాగంగా 2024 డిసెంబర్‌ వరకు వీధి వ్యాపారులకు రుణాలను పంపిణీ చేయనున్నారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం సుమారు లక్షన్నర మందికి రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 61 వేల మందికి వాటిని అందజేశారు. దీంతో తెలంగాణ మరోసారి అగ్రస్థానంలో నిలిచినట్లయింది. లక్షలోపు జనాభాఉన్న పట్టణాల కేటగిరీలో టాప్‌-10 పట్టణాలు రుణాల విషయంలో తెలంగాణవే ఉండడం విశేషం. లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న టాప్‌-10 పట్టణాల జాబితాలో సైతం తెలంగాణకు చెందినవే ఆరు మునిసిపాలిటీలున్నాయి. వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రామగుండం కార్పొరేషన్‌లు ఈ ఘనత సాధించాయి. కాగా, 40 లక్షలకుపైగా జనాభా ఉన్న టాప్‌-10 నగరాల జాబితాలో హైదరాబాద్‌ ముందుంది. వీధి వ్యాపారులకు వ్యాపార వసతి కల్పించేందుకు రాష్ట్రంలో 618 స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్‌లను ఏర్పాటు చేసి 2561 షెడ్లు నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 1259 షెడ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 1392 షెడ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

లాభాలు వడ్డీకే సరిపోయే పరిస్థితి నుంచి ఊరట…

వీధి వ్యాపారులు రోజువారీగా సరుకులు కొని విక్రయిస్తుంటారు. వారికి అవసరమైన డబ్బులను వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకుంటుండడంతో వచ్చిన లాభాలు వడ్డీలు చెల్లించడానికే సరిపోతుంటాయి. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీతో వారికి రుణాలు ఇవ్వడం, డిజిటల్‌ లావాదేవీలు జరిపే వారిని ప్రోత్సహించడం ద్వారా వీధి వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే వీధి వ్యాపారుల ఖాతాలో నెలకు రూ.100 చొప్పున జమ చేస్తారు. ఈ విధానానికి వీధి వ్యాపారుల నుంచి కూడా మంచి స్పందన రావడంతో తొలి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేల చొప్పున ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Thanks! You've already liked this