ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు

వాస్తు సలహాలు.. సూచనలు చేస్తూ ప్రముఖుడిగా పేరొందిన వాస్తు నిపుణుడ్ని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పొద్దు పొద్దున్నే టీవీల్లో వాస్తుకు సంబంధించిన సలహాలు ఇచ్చే ఆయన్ను హోటల్లో హతమార్చిన వైనం సంచలనంగా మారింది. కర్ణాటక హుబ్బళ్లి శివారులో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వాస్తు ప్రముఖుడిగా పేరున్న చంద్రశేఖర గురూజీ.. అనేక టీవీ చానళ్లలో వాస్తుకు సంబంధించిన చర్చలు.. సలహాలు.. సూచనలు ఇస్తుంటారు. జాతీయ స్థాయిలోనూ సరళ వాస్తు నిపుణుడిగా ఆయనకు మంచి పేరుంది. దాదాపు రెండు వేలకు పైగా సెమినార్లలో ఆయన పొల్గొన్నట్లు చెబుతారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాస్తుకు సంబంధించి పదహారుకు పైగా పురస్కారాలు పొందిన ఆయన.. సివిల్ ఇంజనీరింగ్ చేశారు. కాస్మిక్ అర్కిటెక్చర్ లోనూ డాక్టరేట్ పొందిన ఆయన.. సామాన్యులకు సైతం సుపరిచితుడు.

వాస్తు సలహాల కోసం గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఆయన వద్దకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఏం జరిగిందన్న విషయం బయటకు రాలేదు కానీ.. ఆయన్ను విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపేసిన వైనం దిగ్భాంత్రికి గురి చేసేలా మారింది. ఆయన ఒంటిపై 39కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా హోటల్ గదిని.. హోటల్లోని సీసీ కెమేరాల్ని పరిశీలిస్తున్నారు. ఏ కారణంతో ఆయన్ను ఈ తీరులో హత్య చేసి ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

The post ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు first appeared on namasteandhra.

Thanks! You've already liked this