సహజీవనంపై సుప్రీం సంచలన తీర్పు

సహజీవనం…అదేనండి లివ్ ఇన్ రిలేషన్ షిప్…గత దశాబ్దకాలంలో భారత దేశంలో కరోనా వైరస్ లాగా వచ్చి తిష్ట వేసిన పాశ్చాత్య సంస్కృతి. వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటూ మన్మథుడు సినిమాలో నాగార్జున పాడిన పాటను పదే పదే విన్న కొందరు యువతీయువకులు…ఈ లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ వైపు మొగ్గుచూపుతున్నారు. పెళ్లి అనే చట్రంలో తాము ఇరుక్కోవడం ఇష్టం లేదంటూ సహజీవనానికి సై అంటున్నారు. అయితే, ఇష్టమున్నంత కాలం సహజీవనం చేసిన కొన్ని జంటలు…ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారిన వారు వెళ్లిపోతున్న వైనం తెలిసిందే.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఏళ్ల తరబడి సహజీవనం చేసిన తర్వాత తమ పార్ట్ నర్ పై కొందరు యువతులు రేప్ కేసులు పెడుతున్న వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తరహా కేసు ఒకటి తాజాగా సుప్రీం కోర్టు విచారణకు వచ్చింది. దీంతో, అలా రేప్ కేసులు పెడుతున్న యువతులు, మహిళలపై దేశపు అత్యున్నత ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. మహిళ ఇష్టపూర్వకంగా ఓ వ్యక్తితో సహజీవనం చేశాక, ఏదో ఓ కారణంగా గొడవై….ఆ వ్యక్తిపై రేప్ కేసు పెట్టడం సరికాదని తేల్చి చెప్పింది.

ఈ ప్రకారం జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళ నాలుగేళ్ల పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి, మనస్పర్ధలతో విడిపోయిన తర్వాత అతడిపై అత్యాచార కేసు పెట్టింది. అయితే, సహజీవనం చేసే సమయానికి పిటిషన్‌దారు అయిన మహిళకు 21 ఏళ్లున్నాయని, ఇష్టపూర్వకంగానే అతడితో సహజీవనం చేసిన ఆమె…గొడవలు రావడంతో కేసు పెట్టడాన్ని కోర్టు అంగీకరించదని స్పష్టం చేసింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న అన్సార్ మహమ్మద్‌…ప్రి అరెస్ట్ బెయిల్ వారెంట్ ఇవ్వాలని రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించగా…ఆ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో, అతడు సుప్రీం కోర్టుని ఆశ్రయించడంతో ఈ వ్యవహారంపై సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతానికి అన్సార్ మహమ్మద్‌కు యాంటిసిపేటరీ బెయిల్ ను సుప్రీం జారీ చేసింది. అయితే, ఆ ఇద్దరూ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశారని, వారికి ఓ పాప కూడా పుట్టిందని, ఆ మహిళను పెళ్లాడతానని అన్సార్ మాటిచ్చాడని రాజస్థాన్ హైకోర్టు వెల్లడించింది. ఈ కేసులోని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని యాంటిసిపేటరీ బెయిల్‌ ఇవ్వటం కుదరదని స్పష్టం చేసింది.

The post సహజీవనంపై సుప్రీం సంచలన తీర్పు first appeared on namasteandhra.

Thanks! You've already liked this