ఆ రేసులో చివ‌రికి నిఖిలే త‌గ్గాడుగా

అంతా  అనుకున్న ప్ర‌కారం జ‌రిగితే ఈ శుక్ర‌వారం థాంక్యూతో పాటు నిఖిల్ సిద్దార్థ మూవీ కార్తికేయ-2 కూడా విడుద‌ల కావాల్సింది. కానీ థాంక్యూతో పోటీ వ‌ద్ద‌నుకున్నారో లేక సినిమా రెడీ కాలేదో కానీ.. వాయిదా అనివార్యం అయింది. కొత్త డేట్ ఆగ‌స్టు 5కు ఫిక్స్ అయింది. డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు, మీడియాకు కూడా ఈ మేర‌కు స‌మాచారం ఇచ్చేశారు. ప్ర‌మోష‌న్లు కూడా మొద‌లుపెట్టారు.

కానీ ఆ డేట్‌కు ఆల్రెడీ సీతారామంతో పాటు బింబిసార కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇందులో సీతారామం చాలా ముందే డేట్ ఖ‌రారు చేసుకున్న చిత్రం. అది ప‌క్కా క్లాస్ ల‌వ్ స్టోరీ కాబ‌ట్టి దాని ఆడియ‌న్స్ వేరు. కానీ సైన్స్ ఫిక్ష‌న్, ఫ్యాంట‌సీ క‌ల‌గ‌లిసిన‌ కార్తికేయ‌-2కు, బింబిసార చిత్రాల మ‌ధ్య‌ పోటీ ఉంటే అది రెంటికీ మంచిది కాదు. కాబ‌ట్టి వీటిలో ఒక‌టి త‌ప్పుకుంటే మంచిది అనే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మైంది.

ఐతే క‌ళ్యాణ్ రామ్, నిఖిల్‌ల‌లో ఎవ‌రు వెన‌క్కి త‌గ్గుతార‌నే విష‌యంలో ఉత్కంఠ నెల‌కొంది. ఇప్పుడా ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. లేటుగా రేసులోకి వ‌చ్చిన నిఖిలే వెన‌క్కి త‌గ్గాడు. కార్తికేయ‌-2 ఆగ‌స్టు 5న రిలీజ్ కావ‌ట్లేదు. ఈ చిత్రాన్ని త‌ర్వాతి వారం విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో, ఆస‌గ్టు 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఆ తేదీకి ఆల్రెడీ నితిన్ సినిమా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం షెడ్యూల్ అయి ఉంది.

ఐతే ఆ వారం అదొక్క‌టే చెప్పుకోద‌గ్గ రిలీజ్. రెండు మిడ్ రేంజ్ సినిమాలకు ఇండిపెండెన్స్ డే వీకెండ్లో స్కోప్ ఉంటుద‌నే చెప్పాలి. కాబ‌ట్టి స‌మ‌స్య తీరిపోయిన‌ట్లే. 2016లో విడుద‌లైన కార్తికేయ‌ నిఖిల్ కెరీర్లో  బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా వ‌చ్చిన ఎనిమిదేళ్ల తర్వాత దాని సీక్వెల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఈ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

The post ఆ రేసులో చివ‌రికి నిఖిలే త‌గ్గాడుగా first appeared on namasteandhra.

Thanks! You've already liked this