మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్లు

సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పుకునే ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా అని, మంచికి వాడితే అదో మంచి ఆయుధమని, కొందరు దానిని దుర్వినియోగపరుస్తూ  సమాజంలో చిచ్చు పెడుతున్నారని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్ల తీరుపై సీజీఐ ఎన్వీ రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జవాబుదారీతనం, సరైన నియంత్రణ లేకపోవడంతో వ్యక్తుల పరువుకు నష్టం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ఇది, దేశానికి ఎంతో ప్రమాదకరమని, ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో అలజడులకు ఇదే కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాపైనా జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీడియా సంస్థలు తమ డిబేట్లలో కంగారు కోర్టులు (సరైన ఆధారాలు లేని అనధికార కోర్టులు)గా వ్యవహరిస్తున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. ఇక, సోషల్ మీడియా అయితే మరీ దారుణంగా వ్యవహరిస్తోందని అన్నారు. అవగాహన లేమితో కూడిన సమాచారం, పక్షపాతం, ఒక అజెండా ఆధారంగా వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తోందని అభిప్రాయపడ్డారు. జడ్జిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని వాపోయారు.

టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ ఏది మంచో, ఏది చెడో నిర్ధారించలేకపోతున్నాయని, ఈ పరిణామాలతో ఎంతో అనుభవం ఉన్న న్యాయమూర్తులకు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టమవుతోందని అన్నారు. అవగాహన లేకుండా లేదా ఒక స్వార్థపూరితమైన అజెండాతో వ్యాపింపజేసే అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధ్యతను అతిక్రమించడం వల్ల ప్రజాస్వామ్యాన్ని మీడియా రెండడుగులు వెనక్కి తీసుకెళ్తోందని చెప్పారు.

కొంత స్థాయి వరకు ప్రింట్ మీడియా బాధ్యతతో వ్యవహరిస్తోందని, ఎలక్ట్రానిక్ మీడియాకు ఏమాత్రం జవాబుదారీతనం లేదని విమర్శించారు. సోషల్ మీడియా మరీ అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, కానీ విధి తనకు మరో దారి చూపించిందని, న్యాయమూర్తి అయినందుకు తాను బాధపడటం లేదని అన్నారు.

The post మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్లు first appeared on namasteandhra.

Thanks! You've already liked this