మహిళా చైర్ పర్సన్ తో వైసీపీ ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన..వైరల్

జగన్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మహిళలపై భౌతిక దాడుల నేరాలు అదుపులోకి రాకపోవడం కలవరపరుస్తోంది. పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) షాకింగ్ నివేదికను వెల్లడించింది. క్రైమ్ ఇన్ ఇండియా-2020 జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉండడం కలవరపడాల్సిన విషయం.

ఆ నేరాలను అదుపు చేయాల్సిన వైసీపీ నేతలే మహిళలను అవమానించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది.  గతంలో నెల్లూరులో భూకబ్జాను అడ్డుకున్న ఓ మహిళపై వైసీపీ నేత దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. సామాన్య ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలే బరి తెగించి మహిళలపై దాడులకు దిగడం, అసభ్యకర రీతిలో ప్రవర్తించడం వంటివి చేస్తుంటే సమాజంలో భయం ఎక్కడ ఉంటుందన్న ప్రశ్నలు ఉత్పన్నం కాక మానవు.

ఈ క్రమంలోనే ఓ మహిళా చైర్ పర్సన్‍ తో వైసీపీ మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా అసభ్య ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమైంది. పబ్లిక్ గా మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ మనూజా రెడ్డిని నవాజ్ బాషా భుజంతో ఢీకొట్టి అసభ్యంగా ప్రవర్తించడం పెనుదుమారం రేపుతోంది. రోడ్లకు సంబంధించిన నాడు-నేడు ఫొటొ ఎగ్జిబిషన్‌ వంటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నామన్న సోయ కూడా లేకుండా ఒక మహిళా నేతతో ఇలా ప్రవర్తించిన నవాజ్‌ బాషా పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

నవాజ్ బాషా అల్లరి, ఆమెతో పరాచకాలు ఆడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. నలుగురిలో ఉన్నామని, తానొక ఎమ్మెల్యేనని, పక్కన ఉన్నది ఒక మహిళ అని, ఆమె గౌరవ స్థానంలో ఉన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ అని నవాజ్ బాషా మరచిపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, మనూజా రెడ్డి పొట్టిగా ఉన్నందును వీడియోలో కనపడరంటూ బాడీషేమింగ్ చేసేలా వ్యంగ్యంగా నవాజ్ బాషా మాట్లాడారని అంటున్నారు.

ఓ మహిళా నేతను అలా భుజంతో తోయడం అసభ్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో అతి చనువు ప్రదర్శించి ఎమ్మెల్యే పదవికున్న వన్నె తగ్గించారని, నవాజ్ బాషా తన స్థాయిని మరిచి ఆ పదవికే మచ్చ తెచ్చారని కామెంట్లు చేస్తున్నారు. మరి, నవాజ్ బాషాపై జగన్ ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

The post మహిళా చైర్ పర్సన్ తో వైసీపీ ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన..వైరల్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this