జగన్ పై కొడాలి-పేర్ని నానిల ‘చెత్త’ కాల్..వైరల్

అగ్గిపుల్ల…కుక్క పిల్ల…సబ్బు బిళ్ల కాదేది కవితకనర్హం…అన్న శ్రీశ్రీ కవితను ఆదర్శంగా తీసుకున్న జగన్ ఏపీలో కాదేదీ పన్నుకనర్హం అన్న రీతిలో ప్రజలపై పన్ను పోటుతో విరుచుకుపడుతున్నారన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తుగ్లక్ ను తలపించేలా ఈ కాలంలోనూ చెత్తపై పన్ను వేయడంపై ప్రతిపక్షాలు చెత్తెత్తిపోస్తున్నాయి.  చెత్తపై పన్ను వేసిన ఏకైక సీఎం జగన్ అని, ఏపీలో చెత్తపై పన్ను వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

ఇక, రేపు జుట్టుకూ పన్ను వేస్తారేమో గుండ్లు కొట్టించుకోండంటూ గతంలో జగన్ పాలనలో ఉన్న జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు చురకలంటించారు. అయినా సరే వెనక్కు తగ్గని జగన్ చెత్త పన్ను వసూళ్లపర్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఆల్రెడీ అద్దెల భారంతో సతమతవుతున్న తమపై చెత్త పన్ను మరింత భారమవుతోందని, ఆఖరికి చెత్తపై పన్ను వేయడమేంటని ప్రజలు గగ్గోలు పెడుతున్నా మునిసిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఈ చెత్తపన్ను సెగ తాజాగా మాజీ మంత్రి కొడాలి నానికి తగిలింది.

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గుడివాడలో పర్యటిస్తున్న కొడాలి నానికి నిరనస సెగ తగిలింది. చెత్తపై పన్ను వేయడంతో నాని ముందే జనం అసహనం వ్యక్తం చేశారు. దీంతో, గుడివాడ ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని ఇంతకు ముందే చెప్పాను కదా… మళ్లీ ఎందుకు వసూలు చేస్తున్నారని  మున్సిపల్ సహాయ కమిషనర్ ను కొడాలి నాని ప్రశ్నించారు.

అయితే, వసూళ్లలో రాష్ట్రంలోనే గుడివాడ టాప్ ప్లేస్ లో ఉందని, రూ. 16 లక్షల టార్గెట్ కు రూ. 14 లక్షలు వసూలవుతోందని కమిషనర్ చెప్పారు. ఈ మాత్రం దానికి ప్రజలపై పన్ను భారం వేయడం సరికాదని… ఇకపై చెత్త పన్ను వసూలు చేయవద్దని నాని ఆదేశించారు. అంతేకాదు, అక్కడి నుంచే మరో మాజీ మంత్రి పేర్ని నానికి కొడాలి నాని ఫోన్ చేశారు. ‘అన్నా… చెత్త పన్ను వసూళ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి… ఒకసారి సీఎంను కలుద్దాం’ అని చెప్పారు. దీంతో, జగన్ వేసిన చెత్తపన్ను సొంతపార్టీ వారికి కూడా నచ్చడం లేదని విమర్శలు వస్తున్నాయి.

The post జగన్ పై కొడాలి-పేర్ని నానిల ‘చెత్త’ కాల్..వైరల్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this