చంద్రబాబుతో ఆ నటుడి కీలక భేటీ

టీడీపీ గూటికి మోహ‌న్ బాబు వెళ్ల‌నున్నారా ?  అంటే ఇప్ప‌టికిప్పుడు అటువంటి సంకేతాలు ఏమీ లేక‌పోయినా తాజాగా త‌న పాత స్నేహితుడు చంద్ర‌బాబును జూబ్లీహిల్స్ ను క‌లిశారు. గంట‌న్న‌ర‌కుపైగా ఆయ‌న‌తో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇవే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. నిన్న‌మొన్న‌టి దాకా త‌మకు అత్యంత ఆప్తుడిగానే ఏపీ సీఎం జ‌గ‌న్ ను భావించారు. అదేవిధంగా ఆ రెండు కుటుంబాల మ‌ధ్య బంధుత్వాలు ఉన్న రీత్యా తాము చెప్పిన మాట నెగ్గుతుంద‌న్న న‌మ్మ‌కం కూడా ఉంది.

మంచు విష్ణు భార్య వైరోనికా రెడ్డి సాక్షాత్తూ జ‌గ‌న్ కు చెల్లెల్లు వ‌రుస. ఓ విధంగా వైఎస్ ఇంటి అల్లుడు మంచు విష్ణు. అయిన‌ప్ప‌టికీ ఈ ప్ర‌భుత్వంలో మంచు మోహ‌న్ బాబు మాట చెల్ల‌లేదు. కొంత కాలం మోడీకి సన్నిహితంగా ఉంటూ ఢిల్లీ కేంద్రంగా కూడా కొంత లాబీయింగ్ న‌డిపిన‌ప్ప‌టికీ మోహ‌న్ బాబు విద్యా సంస్థ‌ల‌కు రావాల్సిన ఫీజు రీయింబ‌ర్స్మెంట్ నిధులు కానీ ఇత‌ర రాజ‌కీయ ప‌ద‌వులు కానీ ఏవీ వ‌రించ‌లేదు.

ఓ ద‌శ‌లో మోహ‌న్ బాబు మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు వెళ్తార‌ని అందుకు వైఎస్సార్సీపీ హెల్ప్ చేస్తుంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అవి కూడా జ‌ర‌గ‌నే లేదు. ఏ విధంగా చూసుకున్నా జ‌గ‌న్ అనే సీఎం, త‌మ ఇంటి బంధువు మోహ‌న్ బాబుకు ఆర్థికంగా, రాజ‌కీయంగా సాయం చేసిన దాఖ‌లాలు  ఏవీ లేవు. ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేదు.ఆ మ‌ధ్య  ఓ టీవీ ఇంట‌ర్వ్యూ కు వ‌చ్చిన‌ప్పుడు కూడా మోహ‌న్ బాబు తన‌లో దాగి ఉన్న అసంతృప్తిని చెప్ప‌లేక చెప్ప‌లేక చెప్పారు.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబుతో ఉన్నస్నేహం కార‌ణంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తారా ? లేదా ఈ ఇరువురి భేటీ అన్న‌ది కేవ‌లం వ్య‌క్తిగ‌త‌మా అన్న‌ది తెలియాల్సి ఉంది. గ‌తంలో టీడీపీ హయాంలో త‌మ విద్యా సంస్థ‌ల‌కు సంబంధించి (శ్రీ  విద్యా నికేత‌న్, తిరుప‌తి ) బ‌కాయి ప‌డ్డ ఫీజుల‌ను వెంట‌నే చెల్లించాల‌ని మోహ‌న్ బాబు దీక్ష చేశారు. నిర‌స‌న తెలిపారు. అయినా కూడా బాబు ప్ర‌భుత్వం పెద్ద‌గా స్పందించిన దాఖ‌లాలే లేవు అని తేలిపోయింది. ఇప్పుడు కొద్దిగా బీజేపీ వైపు,ఇంకొద్దిగా టీడీపీవైపు ఆయ‌న స్నేహాలన్న‌వి సాగుతున్నాయి. మ‌రి ! రేప‌టి వేళ  ఆయ‌న ఎటు వైపు ఉంటారో !

The post చంద్రబాబుతో ఆ నటుడి కీలక భేటీ first appeared on namasteandhra.

Thanks! You've already liked this