రాష్ట్రపతి ముర్ముకు ఘోర అవమానం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపింది. ద్రౌపది ముర్మును అధిర్ ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించడంపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధిర్ కామెంట్లకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముర్ముకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ కామెంట్లు చేసిన అధిర్ రంజన్ చౌధురిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన మహిళను కించపరిచేందుకు కూడా తన పార్టీ నేతలకు సోనియాగాంధీ అవకాశం ఇచ్చారని స్మృతి ఫైర్ అయ్యారు. సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ…  ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి అని నిప్పులు చెరిగారు. సోనియాగాంధీ పార్లమెంటులోనే కాకుండా దేశంలోని వీధుల్లో కూడా ముర్ముకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్డీయే తరపున ద్రౌపది ముర్మును అభ్యర్థి ఎంపికైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని స్మృతి అన్నారు. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కూడా ఆమెపై దాడి ఆగలేదని మండిపడ్డారు.మరోవైపు తన వ్యాఖ్యలపై అధిర్ రంజన్ వివరణ ఇచ్చారు. తాను పొరపాటున ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించానని, రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. దీన్ని అధికార పార్టీ నేతలు పెద్దది చేస్తున్నారని విమర్శించారు.

ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై అధిర్ ను క్షమాపణ చెప్పమని ఆదేశిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పారని సోనియా అన్నారు.

The post రాష్ట్రపతి ముర్ముకు ఘోర అవమానం first appeared on namasteandhra.

Thanks! You've already liked this