టీ కాంగ్రెస్ కు మరో షాక్…ఆ కీలక నేత రాజీనామా?

తెలంగాణలో కాంగ్రెస్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వరుస షాకులు తగిలేలా కనిపిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా షాక్ నుంచి తేరుకోక ముందే టీ కాంగ్రెస్ కు మరో గట్టి దెబ్బ తగలబోతోందని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ వీర విధేయుడిగా పేరున్న దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై దాసోజుు కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరడం, ఖైరతాబాద్ నుంచి పోటీకి సిద్ధమంటూ సంకేతాలు రావడంతో శ్రవణ్ మనస్తాపం చెందారట. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శ్రవణ్, రాబోయే ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో విజయారెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో తనకు సొంత పార్టీలోనే పోటీ నెలకొందని ఆయన మనస్తాపం చెందారట.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అధికారికంగా ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని శ్రవణ్ స్వయంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తీరుతో కూడా శ్రవణ్ విసిగిపోయారని తెలుస్తోంది. మరోవైపు, గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేర్చుకోవడాన్ని కోమటిరెడ్డి వెంకట రెడ్డి తప్పుబట్టారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరెడ్డి…సుధాకర్ ను చేర్చుకునే విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేశారని అన్నారు. ఇకపై తాను రేవంత్ రెడ్డి ముఖం చూడబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, కోమటిరెడ్డి గురించి రేవంత్ పాజిటివ్ గా వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ విధేయుడని, అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు అవిధేయుడని రేవంత్ అన్నారు. ఏది ఏమైనా..మంచి వక్తగా, పార్టీపై, సమకాలీన రాజకీయాలపై మంచి అవగాహన ఉందని పేరున్న శ్రవణ్ రాజీనామా టీ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.

The post టీ కాంగ్రెస్ కు మరో షాక్…ఆ కీలక నేత రాజీనామా? first appeared on namasteandhra.

Thanks! You've already liked this