మంత్రి అంబటి గాలి తీసిన బండ్ల గణేష్

వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతకాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ తో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన పవన్ పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన్ తన ప్రసంగంలో వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. జగన్ ఒక్క ఛాన్స్ అడిగితే ప్రజలు ఇచ్చారని, ఆయన పాలన ఎలా ఉంటుందో చూశారని పవన్ ఎద్దేవా చేశారు.

అందుకే రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి అధికారం కట్టబెట్టాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. పార్టీ నడిపే సత్తా కేవలం వైసీపీకే ఉందా అని ప్రశ్నించారు. ఈసారి తమ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే పవన్ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కు మంత్రి కేటీఆర్ చేనేత దుస్తుల ఛాలెంజ్ ను విసరడం, దానిని మాజీ మంత్రి బాలినేనిని పవన్ నామినేట్ చేసిన నేపథ్యంలో పవన్ పై అంబటి సెటైర్లు వేశారు.

కాటన్ దుస్తుల ఛాలెంజ్ లు ఆపి రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 175 సీట్లలో పోటీ చేస్తున్నారా? లేదా? అనేది స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా ప్రకటించండి అని పవన్ ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఘాటుగా స్పందించారు. బాబూ…ఓ రాంబాబు…అడిగిన ప్రశ్ననే ఎన్నిసార్లు అడుగుతావయ్యా అంటూ సెటైర్లు వేశారు.

వైసీపీలో అంబటి లాంటి బఫూన్లు అడిగే ప్రశ్నలకు క్లారిఫికేషన్ ఇచ్చేంత సమయం జన సైనికులకు లేదని పవన్ కళ్యాణ్ కు అంతకన్నా లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక, అంబటి రాంబాబు పై పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో స్పందించారు. మా సార్ త్వరలోనే మీకు సమాధానం చెబుతారు రంభల రాంబాబు గారు అంటూ అంబటి గాలి తీశారు బండ్ల గణేష్. మరి, నాగబాబు బండ్ల గణేష్ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందన ఏవిధంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

The post మంత్రి అంబటి గాలి తీసిన బండ్ల గణేష్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this