జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో ప్రభుత్వానికి మద్దతుగా వెంకట్రామిరెడ్డి ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ వంటి సంస్థలపై కూడా ఆయన సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని కోర్టులు, జడ్జిలు ఇబ్బంది పెడుతున్నారంటూ వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. హైకోర్టులోని కొందరు జడ్జీలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, హైకోర్టు వ్యవహారంపై న్యాయ నిపుణులు కూడా విమర్శలు చేశారని ఆయన చెబుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం విశేషం.

ఇక, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా హైకోర్టు వ్యవహరిస్తోందదని, న్యాయవ్యవస్థలోని లోపాలపై అంతా చర్చించుకోవాలని వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. హైకోర్టు జడ్జీలను దూషించిన కేసులో నిందితులకు మూడు నెలలైనా బెయిల్ రాలేదని, కానీ, సీఎం జగన్ ఒక వ్యక్తి దూషిస్తే గంటలో బెయిల్ ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వంపై జడ్జిలు ఏది పడితే అది మాట్లాడకుండా ఉండాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇక, రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ, వార్డు సచివాలయం కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు అమరావతిలో జరిగిన రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న వెంకట్రామిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, జడ్జిలపై, కోర్టులపై ప్రభుత్వ ఉద్యోగి అయిన వెంకట్రామిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

The post జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this