కడపలో అర్ధరాత్రి కుంగిపోయిన మూడంతస్తుల భవనం.. చిక్కుకుపోయిన కుటుంబం

కడపలో ఒక్కసారిగా మూడంతస్తుల భవనం కుంగిపోయింది. నగరంలోని కో-ఆపరేటివ్‌ కాలనీలోని విద్యామందిర్‌ స్కూల్‌ సమీపంలో మూడంతస్తుల భవనం ఉంది. బుధవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కుంగిపోయింది. ఈ భవనం పాతది కావడంతో యజయాని వెంకటరామరాజు గ్రౌండ్‌ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న వారిని ఈ మధ్యే ఖాళీ చేయించారు. ఈ భవనానికి మరమ్మతులు చేయిస్తున్నారు.. మొదటి అంతస్తులో భార్యాభర్తలు ముగ్గురు పిల్లలతో అద్దెకు ఉంటున్నారు. రెండో అంతస్తులో కూడా మరో కుటుంబం ఉంటోంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా శబ్దాలు వినిపించడంతో రెండో అంతస్తులో ఉన్న వారు బయటికి వచ్చి చూశారు. భవనం కుంగిపోవడంతో బయటకు పరుగులు తీశారు. తలుపులు తెరుచుకోకపోవడంతో మొదటి అంతస్తులో ఉన్న వారు లోపలే ఉండిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో కిటికీల ఊచలు తొలగించి వారిని కాపాడారు. భవనం మరమ్మతుల కోసం డ్రిల్లింగ్‌ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

The post కడపలో అర్ధరాత్రి కుంగిపోయిన మూడంతస్తుల భవనం.. చిక్కుకుపోయిన కుటుంబం appeared first on విశాలాంధ్ర.

Thanks! You've already liked this