సజ్జలకు గంగుల డెడ్లీ వార్నింగ్

ఏపీలో టీచర్ల దుస్థితి ఇదంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వైసీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి తెర లేపాయి. ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో వేస్తోంద‌ని, టీచర్లతో తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటోందని హరీష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ రెడ్డితో పాటు పలువురు స్పందించారు.

కేసీఆర్‌తో హ‌రీష్ రావుకు విభేదాలుంటే వాళ్లే ప‌రిష్క‌రించుకోవాల‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ కామెంట్లపై తెలంగాణ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప‌చ్చ‌ని కుటుంబాల‌ను విడదీయ‌డంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సిద్ధహ‌స్తుడ‌ని గంగుల సంచలన విమర్శలు చేశారు. వైఎస్సార్ కుటుంబాన్ని స‌జ్జ‌ల విచ్ఛిన్నం చేశార‌ని షాకింగ్ కామెంట్లు చేశారు.

త‌ల్లిని కొడుకును విడ‌దీసిన స‌జ్జ‌ల‌… అన్నను, చెల్లిని కూడా విడ‌దీశార‌ని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిన స‌జ్జ‌ల‌…ఇప్పుడు పచ్చగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని విడ‌దీయ‌డానికి య‌త్నిస్తున్నార‌ని, అది జరగదని మండిపడ్డారు. 2014కు ముందు అస‌లు స‌జ్జ‌ల అంటే ఎవ‌రికి తెలుసని గంగుల ప్రశ్నించారు. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత వైసీపీలో చేరిన స‌జ్జ‌ల‌ ఆ పార్టీని ఉడుములా ప‌ట్టుకున్నారని ఆరోపించారు.

తెలంగాణ వ్య‌వ‌హారాల‌తో సజ్జలకేం సంబంధం అని గంగుల ప్ర‌శ్నించారు. తెలంగాణలో పథకాలను పోల్చే క్రమంలోనే ఏపీ, ఇత‌ర రాష్ట్రాల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తున్నామ‌ని చెప్పారు. నిజంగా వైసీపీ పాల‌న బాగుంటే హ‌రీశ్ వ్యాఖ్య‌ల‌పై స‌జ్జ‌లకు ఉలికిపాటెందుకని ప్ర‌శ్నించారు. 2014కు ముందు ఉద్య‌మంలోనే తమ సత్తా చూపించామ‌ని, మరోసారి చూపించేందుకు కూడా సిద్ధమని, ఇక‌నైనా త‌మ‌తో పెట్టుకోవ‌ద్ద‌ని వైసీపీ నేత‌ల‌కు గంగుల వార్నింగ్ ఇచ్చారు.

The post సజ్జలకు గంగుల డెడ్లీ వార్నింగ్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this