ఈ నెల సింగరేణి టార్గెట్‌ 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సింగరేణి సంస్థ యజమాన్యం బొగ్గు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. గత మూడు నెలలుగా కుంటుబడిన బొగ్గు ఉత్పత్తి కుంటుపడిన నేపథ్యంలో అన్ని ఏరియాల్లో ఈ నెల నుంచి లోటును భర్తీ చేసుకుంటూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని నిర్ణయించింది. ప్రతి రోజు 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో బొగ్గు రవాణా జరపాలని, రోజుకు 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ తొలగించాలని అన్ని ఏరియాల జీఎంలకు సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు శనివారం సింగరేణి సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌, ఎన్‌.బలరామ్‌, డి సత్యనారాయణ, అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాదికి సింగరేణి సంస్థ 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా, లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో తొలి అర్థ సంవత్సరంలో వర్షాల కారణంగా కొంత వెనుకబడినప్పటికి ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల ఆ లోటును భర్తీ చేసుకోవాలని సూచించారు. అన్ని ఏరియాల వారీగా ప్రణాళిక బద్దంగా ఉత్పత్తి, రవాణా సాధించాలని రక్షణ, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్లు సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన గని వారీగా స్టార్‌ రేటింగ్‌ పద్దతిలో తమ స్థాయిని పెంపొందించడానికి ప్రయత్నించాలని, పర్యావరణహిత చర్యల్లో ఏరియాల వారీగా ప్లాంటేషన్‌ లక్ష్యాలను చేరుకోవాలని డైరెక్టర్‌ అల్విన్‌ సూచించారు. యంత్రాల పనిగంటల పంచుకుని, ఉత్పాదకత పెంచాలన్నారు. బొగ్గు రవాణాకు అనుకూలంగా రైల్వే వారి సహకారంతో రోజుకు 38 రేకుల ద్వారా రవాణా జరిపేందుకు ఏర్పాట్లు చేశామని, దీనికి అనుగుణంగా ఏరియాల వారీగా బొగ్గును అందించాలన్నారు. గత ఆరు నెలల్లో 29.23 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 29.46 మిలియన్‌ టన్నుల రవాణ సాధించామని, 176 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఓబీ తొలగించినట్లు జీఎం సూర్యనారాయణ వివరించారు.

Thanks! You've already liked this