టీచర్ల బదిలీల దరఖాస్తులు 40వేలకు పైనే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బదిలీలు కోరుతూ రెండవ రోజు ఆదివారం వరకు 40,882 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా 2790 దరఖాస్తులు నల్గొండ జిల్లా నుంచి వచ్చాయి. మధ్యాహ్నం వరకు 27,668 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా రాత్రి 9.30 గంటల వరకు ఆ సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు బదిలీల కోసం దరఖాస్తులను విద్యాశాఖ స్వీకరిస్తోంది.

దరఖాస్తుకు సోమవారం చివరి రోజు కావడంతో దరఖాస్తు స్వీకరణ గడువును ఫిబ్రవరి 1వరకు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి టీఎస్‌ యూటీఎఫ్‌ ఈమేరకు లేఖ రాసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ కారణంగా సాఫ్ట్‌వేర్‌ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకోవడంలో టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు. దీంతో మరో రెండు రోజులు దరఖాస్తుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని లేఖలో కోరారు. ఇదిలా ఉంటే దాదాపు 25 వేలకు పైగా టీచర్లు బదిలీలు కానున్నారు.

Thanks! You've already liked this