అధికారంలో ఉండి కుట్రంటే ఎలా కేటీఆర్ సారూ !

అధికారంలో ఉన్న పార్టీలు బాధ్యత మర్చిపోయి .. తమ వైఫల్యాలకు కుట్ర అని ట్యాగ్ తగిలించుకుంటే ప్రజలు ఆ ప్రభుత్వంపై పూర్తిగా విశ్వాసం కోల్పోతారు. అధికారంలో ఉండి కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేస్తే.. ఇక పాలనా సామర్థ్యం ఎక్కడ ఉందన్న ప్రశ్నలు వస్తాయి. ప్రస్తుతం ఉద్యోగ పరీక్షల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన వింతగా ఇలాగే ఉంటోంది. పేపర్ లీకేజీలు బయటపడినప్పటి నుండి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. కానీ సరైన దర్యాప్తు విషయాలు బయటకు రావడం లేదు. కానీ ప్రభుత్వం కంగారు పడిపోతోంది.

అర్థం పర్థం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కో సారి ఒక్కో పరీక్ష రద్దుకు నిర్ణయం తీసుకుంటున్నారు. హడావుడిగా సిట్ వేసి.. మూడు రోజుల్లో నిందితులు వీళ్లే అని … కన్ఫర్మ్ చేశారు. తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి. బీజేపీ కుట్ర… ఏ 2 నిందితుడు బీజేపీ కుట్ర అంటూ… వాదన వినిపించారు. నిజంగా అలాంటి కుట్ర ఏమైనా ఉంటే… గుట్టుగా చేధించి.. ప్రజల ముందు పెట్టడం ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే వ్యవస్థలన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. అలా కాకుండా తమకేమీ చేతకాలేదన్నట్లుగా రాజకీయ ఆరోపణలు చేసుకుంటే….. ప్రజలు అధికారం ఉండేది సొంత పనులు చేసుకోవడానికేనా అని డౌట్ పడతారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సారి పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఉద్యమ ఎజెండాలోనే ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులు నమ్మారు. ఎనిమిదేళ్ల పాటు ఎదురు చూసి ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూంటే.. అడ్డగోలుగా తన్నుకుపోతున్నారన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. అందుకే ఓ నిరుద్యోగి ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ లోపమే.

ఉద్యోగ ప్రశ్నాప త్రాలను ఇంత ఈజీగా తస్కరించవచ్చని ఎవరూ అనుకోరు. అది అంత తేలికగా అయ్యేది కాదు. అందుకే ప్రభుత్వంపై అనుమానాలు పెరుగుతున్నాయి. కుట్రలనే మాటలు కాకుండా తక్షణం చర్యలు తీసుకుని నిరుద్యోగుల్లో నమ్మకం పెంచుకుంటేనే ప్రయోజనం . లేకపోతే మొదటికే మోసం వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

The post అధికారంలో ఉండి కుట్రంటే ఎలా కేటీఆర్ సారూ ! appeared first on తెలుగు360.

Thanks! You've already liked this