కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఉదంతంలో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్.. కేజ్రీవాల్ కు కొత్త షాక్ గా మారారు సుఖేశ్ చంద్రశేఖర్. తీహార్ జైల్లో ఖైదీగా ఉన్న అతను తాజాగా పంపిన లేఖలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున తాను బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికే ఆ మొత్తాన్ని ఇచ్చినట్లుగా అతడు చెప్పాడు.

అతడి వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచనలంగా మారాయి. ఇంతకూ ఈ సుఖేశ్ చంద్రశేఖర్ ఎవరు? అతడి స్థాయి ఏమిటి? ఇప్పుడు అతను తీహార్ జైల్లో ఎందుకు ఉన్నాడు? లాంటి ప్రశ్నలు మదిలోకి రాక మానవు. ఆ విషయంలోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం జాతీయ మీడియాలో మొదలు స్థానిక మీడియా వరకు ఒక వార్త విశేష ప్రచారానికి గురైంది. తీహార్ జైల్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఒక వీఐపీ ఖైదీ గదిలో లభించిన విలాసవంతమైన వస్తువుల మీద పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

సదరు ఖైదీ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడని.. అతడు వాడే బ్రాండెడ్ గుస్సీ చెప్పుల జత విలువ రూ.1.5 లక్షలు కాగా.. అతడి జీన్స్ ప్యాంట్ల విలువ రూ.80 వేలుగా వార్తలు రావటంతో.. ఇంత విలువైన చెప్పులు ఉంటాయా? అన్న ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విలాస వస్తువుల్ని వాడిన ముదురు ఖైదీ ఎవరో కాదు.. ఈ సుఖేశ్ చంద్రశేఖరే. రూ.200 కోట్ల హవాలా కేసులో ఇతగాడు నిందితుడు. సీబీఐ.. ఈడీ కేసుల్ని తాను ఎత్తేయిస్తానంటూ పలువురు వ్యాపారవేత్తల నుంచి కోట్లాది రూపాయిల్ని ఇతడు తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. మోసం కేసులో అతడు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నాడు. అయినప్పటికీ తన విలాసాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో అతని తీరు ఉంటుందన్న విషయం ఇటీవల జరిపిన తనిఖీల్లో బయటపడింది.

ఈ విషయాన్ని పక్కన పెట్టి.. అతగాడి సంచలన ఆరోపణల విషయానికి వస్తే.. తన లాయర్ అనంత్ మాలిక్ ద్వారా కేజ్రీవాల్.. బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశాడు. సదరు లేఖలో సీఎం కేజ్రీవాల్ ఆదేశాలతో తాను హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో రూ.75 కోట్లు అందజేసినట్లుగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం లోపల పార్కు చేసి ఉన్న రేంజ్ రోవర్ లో ఉన్న ‘‘ఎపి’’ అన్న వ్యక్తికి రూ.75 కోట్లు ఇచ్చానని.. సదరు రేంజ్ రోవర్ కారు నెంబరు 6060గా పేర్కొనటం గమనార్హం.

ఇటీవల కోర్టుకు హాజరైన వేళ.. తాను త్వరలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను తీహర్ క్లబ్ కు ఆహ్వానిస్తానంటూ అతను చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి. ఇంతలోనే ఈ లేఖ ఉదంతం బయటకు రావటం గమనార్హం. సుఖేశ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీలోనూ.. తెలంగాణతో పాటు ఏపీలోనూ సంచలనంగా మారాయి. మొత్తంగా చూసినప్పుడు రూ.75 కోట్ల ఆరోపణల బాంబ్ ఈ రెండు రాజకీయ పక్షాలకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయని మాత్రం చెప్పక తప్పదు.

The post కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్! first appeared on namasteandhra.

Thanks! You've already liked this