కనీస పెన్షన్‌కు నోచుకొని సింగరేణి ఉద్యోగ విరమణ కార్మికులు 

మంచిర్యాల ప్రతినిధి, : సింగరేణి సంస్థలో 30సంవత్సరాలుగా పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్‌ రూ.1000 లోపే అందడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే వృద్దాప్య, వికలాంగుల పెన్షన్ల కంటే తాము తక్కువ పెన్షన్‌ పొందుతున్నామని, ఈ పెన్షన్‌ రావడంతో ప్రభుత్వం అందించే పెన్షన్‌ కూడా అందుకోలేకపోతున్నామని సింగరేణి విశ్రాంత ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి పెన్షన్‌ పెరుగుదల లేక కనీస అవసరాలను తీర్చడంలో ఆ పెన్షన్‌ ఏ మాత్రం సరిపోకపోవడంతో వారి పరిస్థితి దీనంగా మారింది. ఇప్పటికే ప్రతీ వేజ్‌బోర్డు సమయంలో తమకు పెన్షన్‌ పెరుగుతుందన్న ఆశతో ఉన్న కార్మికులకు నిరాశే ఎదురవుతోంది.  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ పెన్షన్‌ను పెంచాలని గత 15సంవత్సరాలుగా పదవి విరమణ ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులకు పెన్షన్‌ పథకాన్ని ప్రవేశ##పెట్టినప్పుడు ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్షించి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 5వ వేజ్‌బోర్డు సమయంలో పెన్షన్‌ పథకాన్ని ప్రవేశ##పెట్టగా అప్పటి మూల వేతనం మేరకే పదవి విరమణ కార్మికులకు పెన్షన్‌ను అందిస్తున్నారు. దాన్ని పెంచాలని కార్మిక సంఘాలకు, సింగరేణి యాజమాన్యానికి, కోల్‌ ఇండియా యాజమాన్యానికి వారు వినతి పత్రాలను సమర్పించి ఆందోళనలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 5వ వేజ్‌బోర్డు సమయంలో పదవి విరమణ పొందిన కొంతమంది కార్మికులకు రూ.500లోపే పెన్షన్‌ లభిస్తుండటం గమనార్హం. అప్పటి వేతనాల ఆధారంగా ప్రస్తుతం అదే పెన్షన్‌ చెల్లించడంతో వారు నిత్యావసర వస్తువులను కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 1998వ సంవత్సరంలో పదవి విరమణ పొందిన కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు కనీస పెన్షన్‌ రూ.7,500 ఉండాలని పేర్కొనప్పటికీ వాటిని అమలు చేయడంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యాన్ని చూపిస్తుండటంతో సింగరేణి కార్మికుల పెన్షన్‌ పెరుగుదల అతీగతి లేకుండా పోయింది. ప్రస్తుతం పదవి విరమణ పొందిన కార్మికులకు వారి మూల వేతనం ప్రకారం పెన్షన్‌ లభిస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, ప్రస్తుతం ఉన్న కార్మిక సంఘాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు ఏం చేయలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. చట్టప్రకారం పెన్షన్‌ పథకం నిబంధనల ప్రకారం చట్టప్రకారం తమకు కనీసం పెన్షన్‌ను అందించాలని, తమ కనీస అవసరాలు తీర్చే విధంగానైనా పెన్షన్‌ను పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. సింగరేణి పెన్షన్‌ పొందుతున్న కారణంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే పథకాలను కూడా అందుకోలేకపోతున్నామని, దానికి అనర్హులుగా వారు ప్రకటిస్తున్నారని, మానవతా దృక్ఫథంతోనైనా తమ బాధను అర్థం చేసుకొని పెన్షన్‌ను పెంచాలని కేంద్ర మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Thanks! You've already liked this