పోరాట యోధుడు ‘దాసరి’

విశాలాంధ్ర-నూజివీడు : విప్లవ చైతన్యం కలిగిన పోరాట యోధుడు దాసరి నాగభూషణరావు అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి కొనియాడారు. భూపోరాట యోధుడు, సీపీఐ జాతీయ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు దాసరి నాగభూషణరావు 11వ వర్ధంతి సభ ఆదివారం నూజివీడు మండలం పోతురెడ్డిపల్లిలో నిర్వహించారు. సీపీఐ సీనియర్‌ నాయకులు కొమ్మన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా జేవీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి నాగభూషణరావు విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసేవారని, అనంతరం వామపక్ష పార్టీల భావాలకు ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీల సంఘాల్లో చురుకుగా పని చేశారని తెలిపారు. నూజివీడు తాలూకాలోని భూస్వామ్య, పెట్టుబడిదారి, జమిందారి వ్యవస్థలకు వ్యతిరేకంగా భూపోరాటాలు చేసి తాలూకా పరిధిలో సుమారు 20వేల ఎకరాల భూమిని పేదలకు పంచిన గొప్ప భూపోరాట యోధుడు దాసరి అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు బలహీనంగా ఉన్న జిల్లాల్లో సైతం భూపోరాటాలు నిర్వహించిన ఘనచరిత్ర దాసరి సొంతమన్నారు. ఇందుకు దాసరి నాగభూషణరావు నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో భూపోరాటం నిర్వహించి పేదలకు భూములు పంచడమే నిదర్శనమని వివరించారు. ఆయన రాజకీయంగా కూడా చాలా హుందాగా వ్యవహరించే వారని, ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ప్రత్యర్థులను ఆప్యాయంగా పలకరించేవారని గుర్తుచేశారు. దేశంలో, మనం రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వారు మాత్రమే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్నారని జేవీ సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి అయితే రూ.40 కోట్లు, ఎంపీ అభ్యర్థి అయితే రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని, పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను డబ్బు పంపకాలకు వాడుకుంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీలో మోడీ, అమిషా జోడీ దుర్మార్గాలకు పాల్పడుతోందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాగైనా మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. వారికి అడ్డువస్తే సొంత పార్టీ నాయకులను సైతం హత్యలు చేయించే క్రూరమైన మనస్తత్వం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రాలో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ధనరాజకీయాలు పెరిగిపోయాయన్నారు. అయితే, బీహార్‌లోని బెగుసరారులో సీపీఐ అభ్యర్థిగా కన్హయ్యకుమార్‌ పోటీ చేస్తున్నారని, ఆయనకు ప్రజలే విరాళాలు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి నాయకుడు దాసరి ఉద్యమ, రాజకీయ స్ఫూర్తికి అనుగుణంగా నడవాలని సూచించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, మాలెంపాటి బాలభాస్కరరావు ఆధ్వర్యాన చల్లపల్లి జమిందార్‌ భూములను పేదలకు పంచాలని చేసిన భూపోరాటంలో దాసరి నాగభూషణరావు కూడా అగ్రభాగాన నిలిచారని గుర్తుచేశారు. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నకాలంలో అన్ని ప్రాతాలకు నిధులు కేటాయించిన నాయకుడిగా దాసరిని రాజ్యసభ సభ్యులు అభినందించారని తెలిపారు. కొమ్మన నాగేశ్వరరావు మాట్లాడుతూ నూజివీడు తాలూకాలో భూస్వామ్య, జమిందారి వ్యవస్థలకు వ్యతిరేకంగా దాసరి నాగభూషణరావు అనేక గ్రామాల్లో సభలు పెట్టి ప్రజలను చైతన్యపరిచేవారని తెలిపారు. ఆ సమయంలో ఆయనకు కనీసం మంచినీరు కూడా ఇవ్వొద్దని జమిందారులు, భూస్వాములు ఆంక్షలు విధించారని, అయినా అన్నింటినీ ఎదుర్కొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు దాసరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు చలసాని వెంకట రామారావు, పోతురెడ్డిపల్లి మాజీ సర్పంచ్‌ అక్కికనేని చందు, దిగవల్లి పీఏసీఎస్‌ అధ్యక్షుడు గుంటక ధర్మారెడ్డి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, నూజివీడు పట్టణ కార్యదర్శి ఉన్నం అనిల్‌కుమార్‌, ఏఐటీయూసీ నాయకులు అక్కినేని రాజు, శ్రీను, చంద్రరావు, పోతురెడ్డిపల్లి సీపీఐ శాఖ కార్యదర్శి ఎం.నాగేంద్రం, సీపీఐ నాయకులు నాగేశ్వరరావు, ఏఐఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ కార్యదర్శి గరికే అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Thanks! You've already liked this