కబ్జాలన్నీ తొలగించాలి

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వేల ఎకరాలు
ఆక్రమణలపై సీపీఐ నిరంతర పోరాటాలు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి

విశాలాంధ్ర – విశాఖ రూరల్‌ : గీతం యూనివర్సిటీ, మాజీ మేయర్‌ సబ్బం హరి ఆక్రమణలను తొలగించిన ప్రభుత్వం… మిగతా కబ్జాలపై ఎందుకు దృష్టిపెట్టడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. విశాఖలోని సీపీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గీతం ఆక్రమణలు తొలగించడాన్ని సీపీఐ బలపరుస్తోందని, పార్టీలకు అతీతంగా కబ్జాలను తొలగిస్తేనే ప్రభుత్వానికి నిబద్ధత ఉన్నట్టని, లేనిపక్షంలో రాజకీయ కక్షపూరిత చర్యగా భావిచాల్సి వస్తుందని అన్నారు. విశాఖలో ఏళ్ల తరబడి ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయ నాయకుల కబ్జాల పరంపర కొనసాగుతోందని చెప్పారు. వైసీపీ పాలనలోనూ అదే విధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ విశాఖ కలెక్టర్‌గా ఉన్న సమయంలో మధురవాడ సర్వే నెంబరు 331/5లో స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో జరిగిన అక్రమాలను సీపీఐ వెలుగులోకి తెచ్చిందని, కలెక్టర్‌ కార్యాలయం వద్ద 110 రోజులు సత్యాగ్రహం నిర్వహించామని, ఆ భూముల్లోకి పేదలతో ప్రవేశించి అక్రమ కట్టడాలు కూల్చివేశామని గుర్తు చేశారు. ఆ సందర్భంగా సీపీఐ నాయకులపైనా, ప్రజలపైనా బనాయించిన అక్రమ కేసులకు పదేళ్లకుపైగా కోర్టుల చుట్టూ తిరిగామని, పదకొండేళ్ల తరువాత ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారని, అయినా ఆ భూములు ఇంకా ప్రయివేటు వ్యక్తుల అధీనంలోనే ఉన్నాయని చెప్పారు.
కొత్త గాజువాక హైస్కూల్‌ రోడ్డు కూడలిలో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా ప్రకటించారని, టీడీపీ ప్రభుత్వం శాసనసభ నివేదికను తుంగలో తొక్కి ఆ భూమిని పల్లా సింహాచలం కుటుంబానికి కట్టబెట్టిందని జేవీ సత్యనారాయణమూర్తి విమర్శించారు. పెదగంట్యాడ మండలంలో 274 సర్వే నెంబరులో దాదాపు అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ ప్రాంతానికి చెందిన తిప్పల దయాళ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు అప్పటి గ్రామాధికారి, ప్రస్తుత గాజువాక ఎంఎల్‌ఏ తిప్పల నాగిరెడ్డి పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టుగా నాటి కలెక్టర్‌, ఆర్డీఓలు ప్రకటించినా ఇప్పటికీ ఆ భూములు వారి చేతుల్లోనే ఉండటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ నివేదికలో ధర్మాన ప్రసాదరావు ఆక్రమణలు మాత్రమే లీక్‌చేసి, మిగతా నివేదికను పక్కన పెట్టారని అన్నారు. పలు సందర్భాలలో కలెక్టర్లకు భూ కుంభకోణాలపై సీపీఐ ప్రతినిధులు అనేక ఫిర్యాదులు ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌కి కూడా ఆధారాలతో నివేదిక అందించామని తెలిపారు. కొమ్మాది సర్వే నెం 28/2లో పదెకరాల భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించినా ఇంకా ప్రయివేటు వ్యక్తుల అధీనంలోనే ఉందన్నారు. మాజీమంత్రి గంటా బంధువు పరుచూరి భాస్కరరావు కొమ్మాది సర్వే నెంబరు 154/3లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అన్నారు. సర్వే నెంబరు 7లో 50 ఎకరాలను మైటాస్‌ సంస్థ, సర్వే నెంబరు 161/1లో 10 ఎకరాలను బుద్ధ మహాలక్ష్మి, వై.పార్వతి, పరదేశిపాలెం సర్వే నెంబరు 187/1లో 4.89 ఎకరాలు మాజీ సైనికుడు వాసుపల్లి సత్తయ్య పేరుతో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామమోహన్‌నాయుడు, పీఎం పాలెం సర్వే నెంబరు 20/4లో 2.82 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరుమల రాణి కబ్జా చేశారన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో అంకుర సంస్థకు స్థలం కేటాయింపును అంగీకరించబోమని, కబ్జాకు గురైన భూముల నుంచి కేటాయింపు చేయాలని అన్నారు.
కార్పొరేట్‌ విద్యా సంస్థలు, ఆసుపత్రులు ప్రభుత్వం నుంచి చౌకగా భూములు తీసుకుని ఒప్పందం మేరకు పేదలకు ఉచిత సేవలు అందించడం లేదని, దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండు చేశారు. కరోనా రోగులకు ఆరోగ్య శ్రీపైనా సేవలు అందించేందుకు కార్పొరేట్‌ ఆసుపత్రులు ముందుకురాలేదని గుర్తుచేశారు. అమరావతిలో రైతులకు బేడీలు వేయడాన్ని జేవీ సత్యనారాయణమూర్తి తప్పుబట్టారు. ఎవరికీ బేడీలు వేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, వాటిని పోలీసులు ఉల్లంఘించారని అన్నారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, సహాయ కార్యదర్శి ఎస్‌కె రెహమాన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల పాల్గొన్నారు.

Thanks! You've already liked this