సంక్షేమ నిధుల మళ్లింపు దుర్మార్గం

వైఎస్‌ఆర్‌ జీవిత బీమాకు మరో రూ.510 కోట్లు నిర్మాణ కార్మికులకు రూ.10వేలు పరిహారం జగన్‌ సర్కారుపై కార్మికసంఘాల జేఏసీ ఆగ్రహం

విశాలాంధ్ర- విజయవాడ సిటీ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు చెందిన రూ.960 కోట్లను వైసీపీ ప్రభుత్వం దొంగ దారిలో సంక్షేమ పథకాలకు మళ్లించిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ మళ్లించిన నిధులను తిరిగి జమచేయాలని, సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులను ఆదుకోవాలని, బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ చట్టాన్ని రద్దు చేయవద్దని డిమాండు చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్‌లోని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హాల్‌లో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. సదస్సుకు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏపీబీఎన్‌కేఎస్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి భవన నిర్మాణ కార్మికులకు నష్టం కలిగించేే విధానాలనే అనుసరిస్తున్నారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం జీవో నంబరు 17ను అడ్డుపెట్టుకుని కార్మికుల సంక్షేమ నిధికి చెందిన రూ.450 కోట్లు కాజేసిందని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ జీవిత బీమా పథకం కింద మరో రూ.510 కోట్లను దారి మళ్లించినట్టు తెలిపారు. నూతన ఇసుక పాలసీ వల్ల ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికులను, కార్మిక నాయకులను పిలిచి ఇసుక విధానం గురించి చర్చించాలని డిమాండు చేశారు. ఈ విషయంపై మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేద్దామనుకుంటే వారు అందుబాటులోనే ఉండటం లేదన్నారు. ఏ విషయమైనా ముఖ్యమంత్రి చూసుకుంటారంటూ మంత్రులు తప్పించుకుంటున్నారని విమర్శించారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు, సెస్‌ నిధుల నుంచి కార్మికులకు కనీసం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండు చేశారు. సెస్‌ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడానికి వీలులేదని సుప్రీంకోర్టు ఆదేశించినా ఖాతరు చేయకపోడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏడేళ్లుగా కార్మికవర్గంపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాల వల్ల సాధించుకున్న 44 కార్మికచట్టాలను 4 కోడ్లుగా మార్చటాన్ని కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా వ్యతిరేకించాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ కరోనా కష్టం అందరికీ వచ్చిందని, కానీ ఇసుక కష్టం కేవలం భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే వచ్చిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 30లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, కానీ ఉద్యమంలోకి లక్ష మంది కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలతో దిగిరావని, ఐక్యపోరాటాలతోనే కదులు తాయన్నారు. కార్మికుల కష్టంతోనే దేశం మనుగడ సాగిస్తోందని, కార్మికుల ద్వారా దేశ జీడీపీ వృద్ధి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఇసుక, సెస్‌లతో పాటుగా కార్మిక చట్టాల గురించి పోరాడాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ సెస్‌ నిధులను ముఖ్యమంత్రి తన తండ్రి పేరుతో ఉన్న సంక్షేమ పథకాల ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ‘చంద్రన్న పోయి, జగనన్న వస్తే తమ బతుకులు మారతాయని రాష్ట్ర ప్రజలు అనుకున్నారని, కానీ దొందుకుదొందే అని అన్నారు. సొంత ఇళ్లు నిర్మాణం చేసుకునేవారికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిమాండు చేశారు. హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు నగరాలకు ఇసుక అక్రంగా తరలిస్తున్నారన్నారు. ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌.మోహన్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక దోపిడీకి పాల్పడిందన్నారు.
అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించిన వైసీపీ…నేడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. కార్మికుల కష్టార్జితాన్ని ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించడం అన్యాయమన్నారు. సదస్సులో ఐఎఫ్‌టీయూ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, ఏఐసీసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు సత్యనారాయణ, ఏపీబీఎన్‌కేఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు టిీ.రాజు, ఏఐటీయూసీ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పీవీ రమణ, సీఐటీయూ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు, ఐఎఫ్‌టీయూ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఎం.ఏసు, ఐఎఫ్‌టీయూ ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం నేత ఎల్‌.కుటుంబరావు, ఏపీబీఎన్‌కెేఎస్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పి.వాణి, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. నవంబరు 17న రాష్ట్ర మంత్రుల ఇళ్లు ముట్టడించాలని, 26న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, డిసెంబరు15న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని సదస్సు తీర్మానించింది.

Thanks! You've already liked this