గాజు గ్లాస్ బద్ధలవుతుందా ?

జనసేన

ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ది విచిత్రమైన పరిస్థితి. అసలు ఆయన రాజకీయ పోకడలే వేరేగా ఉంటాయని అంటారు. 2014లో ఆయన పార్టీ పెట్టి పోటీ చేయలేదు. 2019లో పోటీ చేస్తే రెండు చోట్ల ఓటమి చెందిన అధ్యక్షుడిగా ఆయనే కనిపిస్తారు. ఇక 2024 ఎన్నికలకు చాలా దూరం ఉండగానే పొత్తులకు తెరలేపిన నేతగా కూడా ఆయన్నే చూడాలి. ఏడేళ్ల జనసేన పార్టీకి ఇప్పటికీ సొంత గుర్తు లేకపోవడం కూడా మరో చిత్రంగా చెప్పుకోవాలి.

గుర్తింపు లేదుగా….?

ఏపీలో 2019 ఎన్నికల్లో జనసేన దాదాపుగా 140 స్థానాల్లో పోటీ చేసింది. ఆరు శాతం ఓట్లు వచ్చా యని లెక్క చెప్పారు. అయితే అందులో బీఎస్పీ, వామపక్షాల వాటా ఎంతో ఎవరికీ తెలియదు. మొత్తానికి ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు సాధించే స్థాయిలో జనసేనకు ఓట్లు రాలేదు అన్నది తేలిన నిజం. దీంతో జనసేన పార్టీకి సొంత గుర్తు అన్నది ఇపుడు అతి పెద్ద సమస్యగా మారుతోంది. గాజు గ్లాస్ ని 2019 ఎంచుకున్న పవన్ సామాన్యుడి టీ గ్లాస్ ఇది, విజయానికి సంకేతమని బాగా మురిసిపోయారు.

తిరుపతి రచ్చతో ….

తాజాగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుని నవతరం పార్టీ తరఫున ఇండిపెండెంట్ గా పోటీ పడుతున్న ఒక అభ్యర్ధికి ఎన్నికల సంఘం కేటాయించింది. దాంతో రాజకీయ రచ్చ కూడా సాగింది. జనసేననే నమ్ముకున్న బీజేపీ ఈ విషయంలో ఎక్కువ ఆయాసపడిపోయింది. కానీ ఎంత రాద్ధాంతం చేసినా అధికార పార్టీ మీద విరుచుకుపడినా కూడా గుర్తింపు లేని పార్టీగా జనసేన ఉందన్న సత్యాన్ని ఈ సమయంలో బీజేపీ విస్మరించడమే దారుణం. ఎవరో ఏదో చేశారు అని గోడుమంటున్న బీజేపీ తన మిత్రుడి పార్టీకి సొంత గుర్తు లేకపోవడాన్ని ఇప్పటికీ గుర్తించలేకపోవడమే బాధాకరం.

దూకుడుగా వస్తేనే ..?

పవన్ కళ్యాణ్ పార్టీకి 2024 ఎన్నికలు చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పటికి ఆయన పార్టీ పెట్టి పదేళ్ళు పూర్తి అవుతాయి. ఆ ఎన్నికల్లో దూకుడు చేసి ఎక్కువ సీట్లను ఓట్లను తెచ్చుకుంటేనే జనసేన కధ భవిష్యత్తులో నడిచేది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. లేకపోతే చాలా పార్టీల మాదిరిగానే జనసేన కూడా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పాలి. సొంత గుర్తు ఏ పార్టీకైనా ఒక రాజకీయ అస్థిత్వం. అది ఉంటే ఒక ఎన్నిక కాకపోయినా మరో ఎన్నికలో అయినా జూలు విదిల్చి జనాల మద్దతు పొందవచ్చు. లేకపోతే ఎప్పటికీ ఇండిపెండెంట్ కిందనే లెక్క. మరి పవన్ ఎంతో ఇష్టపడి ఎంచుకున్న గాజు గ్లాస్ బద్ధలు కాకుండా కాపాడుకోవాలి. ముందు పార్టీ గుర్తుని నిలబెట్టుకునే రాజకీయ పోరాటమైనా చేయాలి. ఆ దిశగా జనాభిమానాన్ని సొంతం చేసుకునే కృషిని మాత్రం జనసేనాని గట్టిగానే చేయాలన్నదే తిరుపతి ఉప ఎన్నిక చెప్పిన సత్యం.

The post గాజు గ్లాస్ బద్ధలవుతుందా ? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this