వాటర్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంకులో కుళ్లిన శవం

రాంనగర్‌లోని రిసాలగడ్డ జలమండలి వాటర్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంకులో లభ్యమైన కుళ్లిన శవం మిస్టరీ వీడింది. మృతుడు రాంనగర్‌ అంబేడ్కర్‌ నగర్‌ బస్తీకి చెందిన కిషోర్‌ గా పోలీసులు నిర్ధారించారు. పోస్టు మార్టం నిర్వహించి బుధవారం కుటంబసభ్యులకు శవాన్ని అప్పగించారు. పోలీసులు తెల్పిన వివరాల మేరకు అంబేడ్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న పుష్పకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు.

వీరిలో పెద్ద కుమారుడు కిషోర్‌ గతంలో పెయింటింగ్‌ పనులు చేసేవాడు. కొద్దికాలంగా ఆటో నడుపుతూ.. గంజాయి, మద్యానికి బానిసగా మారాడు. అక్టోబర్‌ 19న మద్యం అతిగా తాగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై అక్టోబర్‌ 23న చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

అప్పటి నుంచి అదృశ్యమైన కిషోర్‌ మంగళవారం చిలకలగూడ జలమండలి వాటర్‌ ట్యాంకులో శవమై కన్పించాడు. ముషీరాబాద్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిషోర్‌ స్నేహితుడు మధును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

The post వాటర్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంకులో కుళ్లిన శవం appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this