చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు విసిగి వేసారి పోయారని, జగన్ ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కూడా జగన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అదీగాక, గత ఏడాది కాలంగా అధికార పక్షాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దీటుగా ఎదుర్కొంటోందన్నది కాదనలేని వాస్తవం. 2024లో టీడీపీ గెలుపు ఖాయమని టీడీపీ నేతలంతా  ధీమాగా ఉన్నారు.

ఇటువంటి తరుణంతో తాజాగా టీడీపీ కీలక నేత ఒకరు సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలను చంద్రబాబు నడిరోడ్డుపై వదిలేశారని టీడీపీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది.

తన దగ్గరున్న డబ్బంతా రాజకీయాలకే ఖర్చు చేశానని, 2024 ఎన్నికలు వస్తే తన ఆస్తి మొత్తం కరిగిపోతుందని అన్నారు. ఆ తర్వాత తాను టీకొట్టు పెట్టుకుని బతకాల్సిందేనని, రాష్ట్రంలో టీడీపీ నేతలంతా ఆస్తులు అమ్ముకున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. 2024 ఎన్నికలు వస్తే అందరూ దివాలా తీస్తారని, ఆ తర్వాత ఇక ఆత్మహత్యలే శరణ్యమని సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

తనపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడి గదిలో దేవుడి ఫొటోలను తీసేసి జగన్ ఫొటోలను పెట్టుకున్నారని, అక్రమంగా ఇసుక అమ్ముకుంటూ బస్తాలు బస్తాలు డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా నిలబడిన అభ్యర్థులకు ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్ఠానం భారీగా డబ్బులు ఇస్తుందని చెప్పారు.

The post చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు first appeared on namasteandhra.

Thanks! You've already liked this