కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్

ఈ మధ్యకాలంలో దేశంలో మత సంబంధమైన వివాదాలు ఎక్కువవుతున్నాయి. మహమ్మద్ ప్రవక్త పై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మత వైషమ్యాలు రెచ్చగొట్టాయి. ఇక, ఆ తర్వాత హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన కాళికాదేవిపై మహిళా దర్శకురాలు డైరెక్టర్ లీనా మణి మేకలై తీసిన డాక్యుమెంటరీ పోస్టర్‌ వివాదాస్పదమైంది. ఆ పోస్టర్‌లో కాళీమాత సిగరెట్ తాగుతున్నట్లుగా ఉండడంతోపాటు కాళీ మాత చేతిలో ఎల్‌జీబీటీ ప్లస్ (స్వలింగ్ సంపర్కుల) జెండా ఉండడం దుమారం రేపింది. దీంతో, లీనాపై పలు ప్రాంతాల్లో కేసులు కూడా నమోదయ్యాయి.

అయితే, తాజాగా ఆ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా స్పందించడం ఆ వివాదానికి ఆజ్యం పోసింది. కాళికాదేవి మధుమాంసాలను స్వీకరించే దేవతగా తనకు తెలుసని, అయితే, కాళీమాత ధూమపానం చేస్తుందో, లేదో తనకు తెలియదని మొయిత్రా షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో, హిందూ మతాన్ని కించపరచడం టీఎంసీకి అలవాటైపోయిందని బీజేపీ నేత సువేందు అధికారి ఫైర్ అయ్యారు.
నుపుర్ శర్మపై బీజేపీ చర్యలు తీసుకున్నట్టుగానే మొయిత్రాపైనా సీఎం మమతా బెనర్జీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక, ఆ విమర్శలపై మొయిత్రా స్పందిందచారు. అబద్ధాలతో హిందువులుగా మారలేమంటూ సంఘ్ పరివార్‌పై కామెంట్లు గుప్పించారు. తాను ఏ పోస్టర్‌కు మద్దతు ఇవ్వలేదని, ఒకసారి తారాపీఠ్‌లోని కాళీమందిర్‌కు వెళ్తే అసలు విషయం బోధపడుతుందని కౌంటర్ ఇచ్చారు. అక్కడ అమ్మవారికి భోగం కింద ఆహార, పానీయాలు ఏమి సమర్పిస్తున్నారో చూసి మాట్లాడాలని అన్నారు. అలాగే, సిక్కింలో కాళికాదేవికి విస్కీ సమర్పిస్తారని, ఉత్తరప్రదేశ్‌లో దానిని దైవదూషణగా భావిస్తారని చెప్పారు.

మరోవైపు, తమ ఎంపీ మొయిత్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగతమని స్పష్టం చేసింది. కానీ, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలను మాత్రం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. కాళీమాతపై ఆమె వెల్లడించిన అభిప్రాయం పార్టీ తరఫున చేసింది కాదని వెల్లడించింది.

The post కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this