ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?

తెలుగు రాష్ట్రాల‌లో పాగా వేయాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్న బీజేపీకి దిమ్మ‌దిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రెండు తెలుగు రాష్ట్రాల‌లో వేర్వేరు కార్య‌క్ర‌మాల పేరిట అంత‌టి హంగామా చేసినా కూడా చెప్పుకోద‌గ్గ లీడ‌ర్లు ఎవ్వ‌రూ ఆ పార్టీలో చేర‌లేదు. మాజీ ఎంపీ డాక్ట‌ర్ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి త‌ప్ప ఎవ్వ‌రూ బీజేపీ లో చేర‌లేదు. ఆయ‌న కూడా మోడీ రాక మునుపే నిర్ణ‌యం తీసుకుని బీజేపీ గూటికి చేరిన‌వారు.
అప్ప‌టిదాకా రేవంత్ రెడ్డి ఆయ‌న‌తో సంప్ర‌తింపులు చేశార‌న్న వార్త‌లూ ఉన్నాయి. కానీ ఆయన ఎందుకో కాంగ్రెస్ తో కాకుండా బీజేపీతో జ‌ట్టు క‌ట్టారు. ఇందుకు ఈట‌ల వ్యూహం కానీ బండి సంజ‌య్ మాట కానీ ప‌ని చేసి ఉండ‌వ‌చ్చు. ఆయ‌న త‌ప్ప మ‌రొక‌రెవ్వ‌రూ ఇక్క‌డ చేర‌లేదు. వాస్త‌వానికి తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసేందుకే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసిన అధినాయ‌క‌త్వానికి ఇది ఓ విధంగా మింగుడు  ప‌డ‌ని విష‌య‌మే !
ఓ వైపు కాంగ్రెస్ అధిష్టానంతో త‌గువు పెట్టుకుని మ‌రీ !  మాజీ ఎమ్మెల్యేల‌ను యాక్టివ్ గా ఉన్న నాయ‌కుల‌నూ రేవంత్ రెడ్డి త‌మ పార్టీ గూటికి చేరుస్తుంటే, ఇక్క‌డ మాత్రం ప్ర‌ధాని స్థాయి వ్య‌క్తులు వ‌చ్చినా కూడా చేరిక‌లు లేవు. లేవు స‌రిక‌దా బీజేపీ కి చెందిన న‌లుగురు జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు టీఆర్ఎస్-కు వెళ్లిపోయారు. అది  కూడా మోడీ వ‌చ్చే ముందు జ‌రిగిపోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

ఇక ఏపీలో ఎంత మొత్తుకున్నా బల‌మైన లీడ‌ర్ల‌ను త‌యారు చేయ‌లేక‌పోతోంది ఇక్క‌డి నాయ‌క‌త్వం. పోనీ పేరున్న నాయ‌కులు బీజేపీవైపు వెళ్తారా అంటే అక్క‌డ కూడా అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే ప్ర‌ధాన స‌మ‌స్య  అని తెలుస్తోంది. వీలున్నంత వ‌ర‌కూ  ఉన్న కొద్దిపాటి నాయ‌కులే పార్టీకి దిక్క‌వుతున్నారు. కొత్త ముఖాలేవీ ఇటుగా రావ‌డం లేదు. అదేవిధంగా పార్టీ అనుబంధ విభాగం  అయిన ఏబీవీపీ కూడా బ‌లోపేతం కావ‌డం లేదు. ఏ విధంగా చూసుకున్నా ప్ర‌ధాని ప‌ర్యట‌న‌లో భాగంగా కాస్తో కూస్తో తూగో, ప‌గో క్ష‌త్రియులు ఆనంద ప‌డాలే త‌ప్ప మిగిలిన‌వారెవ్వ‌రికీ ఆయ‌న ప‌ర్య‌ట‌న పెద్ద‌గా క‌లిసి వ‌చ్చే విష‌య‌మూ కాదు విశేష‌మూ కాదు.

The post ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా? first appeared on namasteandhra.

Thanks! You've already liked this