మోడీపై కాంగ్రెస్ నేత కుట్ర‌..గుజ‌రాత్ పోలీసుల సంచ‌ల‌న అఫిడ‌విట్‌

గుజరాత్లో న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు, అప్పటి సీఎం నరేంద్రమోడీపై దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారని గుజ‌రాత్ పోలీసులు సంచ‌ల‌న అఫిడ‌విట్ రెడీ చేశారు. ఈ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ భాగమయ్యారని పేర్కొన్నారు. ఈ మేరకు సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కారణం చెప్తూ.. ఆమె బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించారు.

2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఆరోపణలపై పోలీసు శాఖకు చెందిన సిట్‌ దర్యాప్తు జరుపుతోంది. ఆ కేసులో తీస్తా ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ క్రమంలో కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సిట్‌ కీలక విషయాలు వెల్లడించింది. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు దివంగత కాంగ్రెస్ కురువృద్ధుడు అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు జరిగిన పెద్ద కుట్రలో తీస్తా భాగమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

మోడీ సహా ఇతర అధికారులు, అమాయక ప్రజలను ఇరికించినందుకు గానూ ఆమె చట్టవిరుద్ధమైన ఆర్ధిక ప్రయోజనాలు పొందినట్లు దానిలో వెల్లడించింది. అలాగే గుజరాత్‌లోని బీజేపీ సీనియర్‌ నేతల పేర్లను ఈ కుట్రలో చేర్చేందుకు ఢిల్లీలో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతలను కలిసేవారని పేర్కొంది. పలువురు సాక్షుల వాంగ్మూలాలను ఉటంకిస్తూ.. అఫిడవిట్‌లో ఈ వాదనలను చేర్చింది.

ఓ సాక్షిని ఉద్దేశించి 2006లో ఒక కాంగ్రెస్‌ నేతతో తీస్తా సెత‌ల్వాద్ మాట్లాడిన మాటలను ప్రస్తావించింది. కాంగ్రెస్‌ పార్టీ షబానా, జావెద్‌లకు మాత్రమే ఎందుకు అవకాశం ఇస్తోందని, తననెందుకు రాజ్యసభకు పంపడం లేదని తీస్తా అడిగినట్లు ఆ సాక్షిని ఉటంకిస్తూ పేర్కొంది.

సిట్ అఫిడవిట్ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే.. అహ్మద్ పటేల్ వెనుక ఉండి ఇదంతా నడిపించారని.. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. మరోవైపు.. దీనిని కాంగ్రెస్ ఖండించింది. ఈ ఆరోపణలు కుట్రపూరితమైనవని బదులిచ్చింది.

“సిట్ దాఖలు చేసిన అఫిడవిట్తో నిజాలు బయటపడ్డాయి. ఎవరు ఎవరిపై కుట్ర పన్నారో తెలిసింది. ఈ కుట్రలో అహ్మద్ పటేల్ పాత్ర కేవలం నామమాత్రమే. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయన వెనుక ఉండి ఇదంతా నడిపించారు. గుజరాత్, మోడీల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు“ అని సంబిత్ పాత్ర అన్నారు.

The post మోడీపై కాంగ్రెస్ నేత కుట్ర‌..గుజ‌రాత్ పోలీసుల సంచ‌ల‌న అఫిడ‌విట్‌ first appeared on namasteandhra.

Thanks! You've already liked this