ఉలిక్కిపడుతున్న వైసీపీ… ఆ దమ్ము లేకనే?

ఏపీలో 2024 ఎన్నికల వేడి ఆల్రెడీ రాజుకుందని చెప్పవచ్చు. అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, జనసేనలు కూడా తమ కార్యచరణను రూపొందించుకున్నాయి. అయితే, రాబోయే ఎన్నికలలో గెలుపు గురించి అధికార పార్టీ చేస్తున్న కామెంట్లు చూస్తుంటే మాత్రం….ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లే దమ్ము వైసీపీకి లేదన్న టాక్ వస్తోంది.

ఇటీవల జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విఫలం కావడంతో ఎన్నికల ప్రచారానికి ప్రజల ముందుకు వెళితే సీన్ మరింత ఘోరంగా ఉంటుందన్న భయం వైసీపీ నేతలకు పట్టుకుంది. ఇక, వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఒక్కతాటిపైకి వస్తున్నాయన్న వార్తలు ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. అందుకే,  వ్యూహాత్మకంగా విపక్ష పార్టీలు కలిసి రాకుండా విడగొట్టేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన…కలిసి వస్తే బీజేపీతో వైసీపీపై మూకుమ్మడి దాడి చేసే అవకాశముందన్న ప్రచారం జగన్ ను సైతం కలవరపెడుతోంది. అదే జరిగితే తమ ఓటమి ఖాయమని ఫిక్స్ అయిన వైసీపీ…ఎన్నికలకు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తోంది. అందుకే, టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య చిచ్చు పెట్టేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. బీజేపీని పక్కనబెడితే…జనసేన-టీడీపీలు మరోసారి కలవడం ఖాయమని, అదే జరిగితే 2014 ఎన్నికల ఫలితం రిపీట్ అవుతుందని వైసీపీ నేతలు తెగ భయపడుతున్నారట.

“దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి“ ఈ స్లోగన్ ను వైసీపీ ప్రధానంగా ప్రచారం చేయడానికి కారణం కూడా ఇదే. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు టీడీపీ-జనసేన భావి కూటమి ఓట్లు తోడైతే ఓటమి ఖాయమన్న భయంతోనే వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. తమ నవ రత్నాలు, సంక్షేమ పథకాలు మరోసారి తమను గెలిపిస్తాయని ధీమాగా ఉన్న వైసీపీ నేతలు…ఎన్ని పార్టీలు కలిసినా తమను ఓడించలేరన్న ధీమాను వ్యక్తం చేయలేకపోవడం కూడా ఓటమి భయానికి నిదర్శనమే.

గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న పార్టీ…రాబోయే ఎన్నికల్లో కనీసం 100 సీట్లయినా తెచ్చుకుంటామన్న నమ్మకంతో స్టేట్ మెంట్లు ఇవ్వాలి. ఈసారి 175కు175 సీట్లు గెలుస్తామని జగన్ చెబుతున్నా…అది పెదవిపై నుంచి వస్తున్నమాటేగానీ..లోపల మాత్రం ఓటమి భయం వెంటాడుతోంది. ఏది ఏమైనా…ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదని ఫిక్సయిన వైసీపీ నేతలు…విపక్ష పార్టీలను విడగొట్టే ప్రయత్నాలనే నమ్ముకున్నరన్నది స్పష్టమవుతోంది.

The post ఉలిక్కిపడుతున్న వైసీపీ… ఆ దమ్ము లేకనే? first appeared on namasteandhra.

Thanks! You've already liked this