ఆ తీర్పు నీకు చెంపపెట్టు జగన్…నిప్పులు చెరిగిన చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ కు సుప్రీం కోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతాలకు మళ్లించిన రూ.1100 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నిధులను 2 వారాల్లోపు వెనక్కిచ్చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించడంతో జగన్ కు షాక్ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు చెంపపెట్టు అని దుయ్యబట్టారు.

తప్పులు చేయడం, వాటిని సమర్థించుకోవడం కోసం కొత్త తప్పులు చేయడం జగన్ కు అలవాటైందని మండిపడ్డారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు కేటాయించిన నిధులను దారి మళ్లించడం మానవత్వం లేని జగన్ వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సుప్రీం ఆదేశాల ప్రకారం నాలుగు వారాలలోపు కొవిడ్ తో ఛిన్నాభిన్నం అయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కరోనా, వరదలు వంటి విపత్తులు ప్రజలను అతలాకుతలం చేస్తున్న సమయంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ, అదే ప్రభుత్వం వారికి నిధులిచ్చి సాయం చేయకపోగా…ఆ నిధులను దారి మళ్లించడం ఏమిటని మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో సేద తీరుతున్నాడని, జగన్ గాల్లో తిరిగితే వరద బాధితుల బాధలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు.

పీకల్లోతు వరద నీటిలో జనం మునిగి ఉన్నారని, కానీ, జగన్ మాత్రం కాలికి బురదంటకుండా హెలికాఫ్టర్‌లో తిరుగుతున్నాడని విమర్శించారు. వరదల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారని, వందల ఇళ్లు నీట మునిగాయని, జనం వరద నీటిలోనే కంటిపై కునుకు లేకుండా బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కారు విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు.

అందుకే, వరద బాధితుల కష్టాలు స్వయంగా తెలుసుకొని వారిని పరామర్శించేందుకు ఈ నెల 20,21,22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 20న కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో, 21న కూనవరం, చింతూరు, ఏటపాక, వీఆర్‌పురం మండలాల్లో.. 22న పి.గన్నవరం, రాజోలులో తన పర్యటన సాగుతుందని అన్నారు.

The post ఆ తీర్పు నీకు చెంపపెట్టు జగన్…నిప్పులు చెరిగిన చంద్రబాబు first appeared on namasteandhra.

Thanks! You've already liked this