రాజ‌గోపాల్‌ రెడ్డికి.. రేవంత్ స్కెచ్‌

కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగ‌రేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిన న‌ల్ల‌గొండ జిల్లా మునుగో డు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాల‌ని నాయ‌కులు ముక్త‌కంఠంతో కోరుతున్నారు. ఆయ‌న‌ను అలా వ‌దిలేయొద్దంటూ.. వీహెచ్ స‌హా.. అనేక మంది ఇప్ప‌టికే బ‌హిరంగ వేదిక‌ల‌పై డిమాండ్ చేశారు. ఇప్పుడు రేవంత్‌కు కూడా.. ఇదే విష‌యంపై పార్టీ నాయ‌కుల నుంచి అభ్య‌ర్థ‌న‌లు అందుతున్నా యి.

రేపు రాజ‌గోపాల్ మాదిరిగా మ‌రికొంద‌రు చేసే అవ‌కాశం ఉంద‌ని.. కాబ‌ట్టి.. నాయ‌కులు మొద‌లుకొని కేడర్ వ‌ర‌కు గట్టి సంకేలతాలు పంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాజగోపాల్ పైన వేటు.. నియోజక వర్గంలో పార్టీ బలోపేతం పైన వెంటనే చర్యలు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డి తీరును ఎండగట్టేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక కేడర్‌ను ఆదేశించారు. ఇందులో భాగంగానే.. కేడర్‌కు భరోసా కల్పించేందుకు 50వేల మందితో బహిరంగ సభ నిర్వహించాలని   నిర్ణయం తీసుకున్నారు.

ఇటు హైదరాబాద్ కేంద్రంగా రాజగోపాల్ రెడ్డి తన కార్యాచరణ వేగవంతం చేసారు. బుధవారం రాత్రి ఒక ఫాం హౌస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయన సమావేశం అయినట్లు విశ్వసనీయ సమాచారం. సాయంత్రమే బండి సంజయ్ తో రాజగోపాల్ రెడ్డి ఫోన్ మంతనాలు జరిపారు. ఆ తరువాత ఇద్దరు కలిసినట్లు తెలుస్తోంది.

బండి సంజయ్ స్వయంగా పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి చేరిక ఖాయమని చెప్పటంతో..ఇక, దీని పైన అనుమానాలు తొలిగిపోయాయి. కాంగ్రెస్ వేటు వేసే దాకా వేచి చూడటమా.. లేక, ముందుగానే స్పీకర్ ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటమా అనే అంశం పైన రాజగోపాల్ రెడ్డి తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. రేపు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

ఆ పర్యటన సమయంలో రాజీనామా..భవిష్యత్ కార్యాచరణ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇక, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించి..బీజేపీ ఉప ఎన్నికల సవాల్ ను స్వీకరించేందుకు సిద్దంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. మునుగోడు ఉప ఎన్నికకు ముందే రేవంత్ అక్కడ అభ్యర్ధిని ఎంపిక విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. రాజగోపాల్ రెడ్డి పైన పార్టీ అభ్యర్ధిగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలోకి దించాలనే ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

దీని ద్వారా తనకు పీసీసీ వచ్చిన సమయం నుంచి ఆ తరువాత వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఇప్పుడు ఇరకాటంలో పెట్టటంతో పాటుగా.. వెంకటరెడ్డి బరిలో నిలిస్తేనే రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్ట గలుగుతామని చెబుతున్నట్లుగా సమాచారం. అయితే, సోదరుడి మీద పోటీకి వెంకటరెడ్డి సిద్దమవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం రాజ‌గోపాల్‌రెడ్డి వ్య‌వ‌హారం.. కాంగ్రెస్‌ను తీవ్ర‌స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురిచేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

The post రాజ‌గోపాల్‌ రెడ్డికి.. రేవంత్ స్కెచ్‌ first appeared on namasteandhra.

Thanks! You've already liked this